మాటలు దంచుడు కాదు.. దమ్ముంటే ధరలు దించు.
* నెలకు 162 కోట్ల దోపిడీ.. కనీసం 10 శాతం వ్యాట్ తగ్గించాలి.
* మీది ప్రజా పాలన కాదు.. పన్నుల పీడన.
* సీఎం రేవంత్‌కు హరీశ్ రావు బహిరంగ లేఖ
హైదరాబాద్, మహా.
కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూడకుండా తక్షణమే వ్యాట్ తగ్గించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోమవారం ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. “ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాటలు దంచుడు కాదు.. దమ్ముంటే మాట మీద నిలబడి పెట్రోల్, డీజిల్ ధరలు దించు” అని ఆయన సీఎంకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలన ప్రజా పాలన కాదని, పన్నులతో దండుకునే ప్రజా పీడన పాలన అని తీవ్రస్థాయిలో విమర్శించారు.
**వ్యాట్ రూపంలో వందల కోట్ల దోపిడీ**
లీటర్ పెట్రోల్ ధర రూ. 115కు చేరుకోగా, అందులో 35 శాతం రాష్ట్ర వ్యాట్ ఉందని హరీశ్ రావు లెక్కలతో సహా వివరించారు. డీజిల్ ధర రూ. 103 కాగా, అందులో 27 శాతం రాష్ట్ర పన్నుల భారమే ఉందన్నారు. తాజాగా పెరిగిన ఏడున్నర రూపాయల్లో రెండున్నర రూపాయలు రాష్ట్ర వ్యాట్ కింద ఖజానాకు చేరుతోందని స్పష్టం చేశారు. ఈ పెంపు వల్ల ప్రజలపై నెలకు రూ. 162 కోట్లు, ఏటా ఏకంగా రెండు వేల కోట్ల రూపాయల అదనపు పన్నుల భారం పడుతోందని ఆరోపించారు. ధరలు పెరిగిన ప్రతిసారీ వ్యాట్ రూపంలో ఖజానా నింపుకుంటూ రేవంత్ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోందని మండిపడ్డారు.
**సామాన్యుడి నడ్డి విరుస్తున్న ధరలు**
పెరిగిన ఇంధన ధరలతో అన్ని వర్గాల ప్రజలు సతమతమవుతున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పొలం దున్నాలన్నా, సామాన్యుడు బైక్ తీయాలన్నా, ఆటో కార్మికుడు బతుకు బండి నడపాలన్నా ఇంధనం ఖర్చు పెనుభారంగా మారిందని వివరించారు. రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగి పేద, మధ్యతరగతి కుటుంబాల జీవనం అస్తవ్యస్తంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం వారంలో నాలుగు సార్లు ధరలు పెంచుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు.
**తక్షణమే 10 శాతం వ్యాట్ తగ్గించాలి**
నాడు పీసీసీ హోదాలో ఇంధన ధరలపై ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి, నేడు అధికారంలో ఉండి కనీసం 0.1 శాతం వ్యాట్ కూడా తగ్గించకపోవడం ఆయన రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని హరీశ్ రావు దుయ్యబట్టారు. ఇది నిజంగా ప్రజా పాలనే అయితే వెంటనే పెట్రోల్, డీజిల్‌పై కనీసం 10 శాతం వ్యాట్ తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.
**రాహుల్ గాంధీ స్పందించాలి..**
ఇంధన ధరల పెంపుపై మొసలి కన్నీరు కార్చే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణలో జరుగుతున్న ఈ వ్యాట్ దోపిడీపై తక్షణమే స్పందించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. సామాన్యుడికి మేలు జరిగేలా వ్యాట్ తగ్గించాలని సీఎం రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ఆదేశించాలని లేఖలో కోరారు.








