Mahaa Daily Exclusive

  కాంగ్రెస్, బీజేపీల దొంగ ఓట్లకు చెక్ పెట్టాలి….

Share

కాంగ్రెస్, బీజేపీల దొంగ ఓట్లకు చెక్ పెట్టాలి.
• మళ్లీ అధికారంలోకి రాగానే హైదరాబాద్‌కు 24 గంటల నీళ్లు.
• మేం కట్టినవి వీళ్లు ఓపెన్ చేస్తున్నారు.
• ఈసారి కార్యకర్తలకు తగిన గౌరవం దక్కుతుంది.
• బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
కూకట్‌పల్లి,మహా.
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో కాంగ్రెస్, బీజేపీలు నమోదు చేయిస్తున్న దొంగ ఓట్ల పట్ల బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలకు ఎస్ఐఆర్‌పై ఆయన ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పక్కాగా పనిచేస్తూ ఏ ఒక్క ఓటరును కోల్పోకుండా చూసుకోవాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
**24 గంటల పాటు తాగునీరు..**
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే హైదరాబాద్ నగరంలో ప్రతి ఇంటికీ 24 గంటల పాటు నిరంతరం తాగునీరు సరఫరా చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. గతంలో తెలంగాణకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తుచేశారు. అదే తరహాలో నగరానికి నిరంతర మంచి నీరు అందించేది కూడా కేసీఆరేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మార్కు పాలనపై నగర ప్రజలకు పూర్తి అవగాహన ఉందని, అందుకే గత ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా కట్టబెట్టలేదని ఎద్దేవా చేశారు.
**అబద్ధాలు చెప్పుకుంటున్నారు..**
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కట్టిన ఫ్లై ఓవర్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ భవనాలను ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ప్రారంభిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పైగా వాటిని తామే నిర్మించామంటూ అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. గతంలో తాము కేవలం అభివృద్ధిపైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టామని చెప్పారు. ఈసారి అధికారంలోకి వచ్చాక పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి తగిన ప్రాధాన్యత, సముచిత గౌరవం దక్కేలా చూస్తామని ఆయన కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.