Mahaa Daily Exclusive

  తెలంగాణ పల్లెలకు కేంద్రం భారీ నజరా…

Share

తెలంగాణ పల్లెలకు కేంద్రం భారీ నజరా.
* రూ.9,968 కోట్ల నిధులు కేటాయింపు.
* ఐదేళ్లపాటు గ్రామాల అభివృద్ధికి భారీ గ్రాంట్.
* జీతాలకు వాడొద్దంటూ కేంద్రం కఠిన నిబంధనలు.
*పనితీరు బాగుంటేనే అదనపు కేటాయింపులు

హైదరాబాద్, మహా.
తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతం, అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్ల కాలానికి రాష్ట్రానికి రూ.9,968 కోట్లను గ్రాంట్‌గా నిర్దేశించింది. ఈ నిధులను కేవలం గ్రామాల అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని, జీతభత్యాలు, పెన్షన్ల కోసం వాడరాదని స్పష్టమైన, కఠినమైన నిబంధనలు విధించింది.
**కేవలం ప్రజా సేవల కోసమే..**
గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా ప్రజా పరిషత్‌లలో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ రహదారులు, వీధి దీపాల వంటి ప్రజా సేవల కోసమే ఈ నిధులను ఖర్చు చేయాలని కేంద్రం స్ప‌ష్టం చేసింది. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పటిష్ఠమైన పర్యవేక్షణ విధానాలను ప్రవేశపెట్టింది. ప్రతి స్థానిక సంస్థ తమ ఖర్చు వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచాలి. త్రైమాసిక, వార్షిక నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి, అక్కడి నుంచి కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. ఆడిట్‌లో లోపాలుంటే సరిదిద్దాలని, అవకతవకలు రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
**80 శాతం నేరుగా పంచాయతీలకే..**
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.4,35,236 కోట్లను ఆర్థిక సంఘం కేటాయించింది. ఈ నిధులలో 80 శాతం నేరుగా గ్రామ పంచాయతీలకు, 10 శాతం మండల పరిషత్‌లకు, మరో 10 శాతం జిల్లా పరిషత్‌లకు అందజేస్తారు. ఏటా జూన్, అక్టోబర్ నెలల్లో రెండు విడతలుగా ఈ గ్రాంట్లను విడుదల చేస్తారు. మొత్తం నిధుల్లో 20 శాతం కేటాయింపులు స్థానిక సంస్థల పనితీరుపై ఆధారపడి ఉంటాయి. పన్నుల వసూళ్లు, సొంత ఆదాయ వనరుల పెంపుదల వంటి అంశాలను ఇందుకు ప్రామాణికంగా తీసుకుంటారు.
**పక్కాగా నిధుల విడుదల ప్రక్రియ**
కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు చేరిన నిధులను పది పనిదినాల్లోగా స్థానిక సంస్థల ఖాతాలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. మొదటి విడత నిధులు పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ వివరాలు, 2025-26 ఆడిట్ నివేదికలను కేంద్రానికి సమర్పించాలి. ఎన్నికలు జరిగి, ప్రజాప్రతినిధులు ఉన్న సంస్థలకు మాత్రమే ఈ గ్రాంట్లు వర్తిస్తాయి. నిధుల వినియోగంపై గ్రామసభల్లో, పరిషత్ సమావేశాల్లో తీర్మానాలు చేసి, వాటిని తప్పనిసరిగా ఇ-గ్రామ్‌స్వరాజ్‌ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.