అక్రమ ఇసుక తవ్వకాలపై ఈడీ కొరడా.
* రూ.2,407 కోట్ల కుంభకోణం వెలుగులోకి.
*భారీగా నగదు, వెండి పట్టివేత.
* ముమ్మరంగా కొనసాగుతున్న దర్యాప్తు.
హైదరాబాద్, మహా.
ఆంధ్రప్రదేశ్‌లో గతంలో జరిగిన భారీ ఇసుక కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝుళిపించింది. ఉమ్మడి రాష్ట్ర గనుల శాఖ మాజీ డైరెక్టర్ వి.జి.వెంకటరెడ్డి సహా పలువురు బడా కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థలపై ఏకకాలంలో దాడులు నిర్వహించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద హైదరాబాద్, జైపూర్, కోయంబత్తూరు తదితర ఎనిమిది ప్రాంతాల్లో ఈనెల 26న విస్తృత సోదాలు చేపట్టినట్లు ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం తాజాగా ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది.
**ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో జల్లెడ..**
ఈ దాడుల్లో మెసర్స్ జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, మెసర్స్ ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, మెసర్స్ టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్ తదితర సంస్థల అధికారిక కార్యాలయాలను అధికారులు జల్లెడ పట్టారు. వీటితో పాటు హైదరాబాద్, జైపూర్‌లలోని బోయినపల్లి శ్రీనివాసరావు, అశోక్ కుమార్, వి.జి.వెంకటరెడ్డిల నివాసాలతో పాటు, బోయినపల్లి శ్రీనివాసరావుకు చెందిన ఫామ్‌హౌస్‌లోనూ సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ. 1.53 కోట్ల భారతీయ నగదు, 1800 అమెరికన్ డాలర్లు, రూ. 1.29 కోట్ల విలువైన వెండి కడ్డీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పలు కీలక డిజిటల్ పరికరాలతో పాటు నిందితులు, వారి కుటుంబ సభ్యుల పేర్ల మీదున్న చరాస్తులు, స్థిరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలను సీజ్ చేశారు.
**రూ. 2,407 కోట్ల జరిమానా వసూలుకు నోటీసులు..**
అసలు ఈ దర్యాప్తునకు ప్రధాన కారణం విజయవాడ (ఎన్టీఆర్ జిల్లా) అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన ఎఫ్ఐఆర్ అని ఈడీ పేర్కొంది. టెండర్ల నిబంధనలను ఉల్లంఘించి అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడిన వ్యవహారంలో మాజీ గనుల శాఖ డైరెక్టర్ వి.జి.వెంకటరెడ్డితో పాటు జైప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (జేపీవీఎల్), ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, జీసీకేసీ ప్రాజెక్ట్స్ సంస్థలపై ఏసీబీ గతంలో కేసు నమోదు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇసుక తవ్వకాలపై విచారణ జరిపిన జిల్లా స్థాయి ఇసుక కమిటీలు (డీఎస్‌ఎల్‌సీ).. ఈ మూడు సంస్థలు అనుమతించిన లోతు కంటే విపరీతంగా తవ్వకాలు జరపడంతో పాటు, అసలు అనుమతి లేని ప్రాంతాల్లోనూ అక్రమంగా ఇసుకను తోడేసినట్లు నిర్ధారించాయి.
**బయటపడ్డ డొంక..**
డీఎస్‌ఎల్‌సీ ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ ఉల్లంఘనలపై అప్పట్లో గనుల శాఖ డైరెక్టర్ కార్యాలయం సదరు సంస్థలకు షోకాజ్ నోటీసులతో పాటు డిమాండ్ నోటీసులు జారీ చేసింది. అక్రమాలకు పాల్పడిన ఆ మూడు సంస్థల నుంచి ఏకంగా రూ. 2407.70 కోట్ల పెనాల్టీ వసూలు చేయాలని డిమాండ్ నోటీసుల్లో స్పష్టం చేసినట్లు ఈడీ తన విచారణలో గుర్తించింది. ఏసీబీ నమోదు చేసిన కేసుకు తోడు, ఈ భారీ కుంభకోణంలో జరిగిన మనీ లాండరింగ్ కోణాన్ని వెలికితీసేందుకు తదుపరి దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు.








