సెల్ఫీ అడిగిన అభిమానిని విస్మరించిన పూజా హెగ్డే.
* ‘అంత పొగరా’ అన్న విమర్శలపై బుట్టబొమ్మ వివరణ.
హైదరాబాద్, మహా.
టాలీవుడ్ బుట్టబొమ్మ, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సోషల్ మీడియాలో అనూహ్యంగా విమర్శల పాలయ్యారు. ఇటీవల ఓ ఈవెంట్‌లో సెల్ఫీ కోసం ప్రయత్నించిన అభిమానిని కనీసం పట్టించుకోకుండా ఆమె వెళ్లిపోవడం వివాదానికి దారితీసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో, ఆమెకు ‘అంత పొగరా’ అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై వస్తున్న విమర్శలు, ట్రోలింగ్‌పై ఎట్టకేలకు పూజా హెగ్డే స్పందిస్తూ వివరణ ఇచ్చుకున్నారు.
బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ హీరోగా నటించిన ‘హై జవానీతో ఇష్క్ హోనా హై’ చిత్రంతో జూన్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పూజా హెగ్డే సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్ర విడుదల తేదీ సమీపిస్తుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో పూజా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఓ ప్రచార కార్యక్రమంలో ఈ వివాదం చోటుచేసుకుంది. ఈవెంట్ ముగించుకుని హడావిడిగా వెళ్తున్న సమయంలో ఓ అభిమాని సెల్ఫీ కోసం ఆమెను సమీపించాడు. అయితే, ఆమె ఆ అభిమాని వైపు కన్నెత్తి కూడా చూడకుండా, ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఈ చర్యతో మనస్తాపం చెందిన అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆమె తీరును తప్పుబట్టారు.
నెట్టింట పెరుగుతున్న వ్యతిరేకతను గమనించిన పూజా హెగ్డే వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటనపై ఆమె స్పందిస్తూ.. ఉద్దేశపూర్వకంగా తాను ఎవరినీ విస్మరించలేదని స్పష్టం చేశారు. “సినిమా వాళ్లకు జీవితాన్ని ఇచ్చేది ప్రేక్షకులే. కొన్నిసార్లు ఈవెంట్లలో ఉండే తీవ్రమైన హడావిడి, రద్దీ పరిస్థితుల వల్ల అభిమానులను గమనించలేకపోవచ్చు. అంతేకానీ మాకు పొగరు ఉందని కాదు. మాకు ఎప్పుడూ అభిమానులే దేవుళ్లు. దయచేసి జరిగిన దాన్ని బట్టి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు” అని పూజా హెగ్డే విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు.








