Mahaa Daily Exclusive

  వ్యవసాయానికి ఉరితాడుగా ‘రైతు డిస్కం’….

Share

వ్యవసాయానికి ఉరితాడుగా ‘రైతు డిస్కం’.
* దమ్ముంటే 24 గంటల కరెంట్‌పై సీఎం ప్రమాణం చేయాలి.
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ధ్వజం.
*డిస్కంల అప్పులపై పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపాటు.
* మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు.
సిద్దిపేట, మహా.

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న ‘రైతు డిస్కం’ (ఆర్పీడీసీఎల్) ఏర్పాటును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. 24 గంటల ఉచిత కరెంట్ కోసమే ఈ మూడో డిస్కం ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం పచ్చి అబద్ధమని, దీనివల్ల రైతులకు ఉచిత విద్యుత్ రాకపోగా, అది వ్యవసాయ రంగానికి ఉరితాడుగా మారబోతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.గతంలో రేవంత్ రెడ్డితో పాటు, ఈఆర్సీ ముందు జరిగిన పబ్లిక్ హియరింగ్‌లో కాంగ్రెస్ పార్టీ సైతం రైతులకు మూడు గంటల కరెంట్ చాలని చెప్పించిందని ఆయన గుర్తుచేశారు. దమ్ముంటే 24 గంటల ఉచిత విద్యుత్‌ను రైతులకు ఇస్తేనే తాను ఎన్నికల్లో ఓట్లు అడుగుతాను అని సీఎం ప్రమాణం చేయాలని ఆయన సవాల్ విసిరారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా 13 గంటలకు మించి కరెంట్ రావడం లేదని, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల తరహాలోనే రేపు తెలంగాణలో కూడా కేవలం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల కరెంట్ మాత్రమే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు.
సోలార్ పవర్‌తో వ్యవసాయానికి కరెంట్ ఇవ్వాలనే ప్రభుత్వ ఆలోచనపై హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ ఎనిమిదిలో స్పష్టంగా టీజీఆర్పీడీసీఎల్‌కు రిన్యూవబుల్ ఎనర్జీ ఇస్తామని చెప్పారని, ఉదయం ఏడు గంటలకు వచ్చి సాయంత్రం ఐదు గంటలకు ఆగిపోయే సోలార్ పవర్‌ను నమ్ముకుని 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పడం ప్రజలను వంచించడమేనని దుయ్యబట్టారు. కేవలం పగలు మాత్రమే కరెంట్ ఇస్తే మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేయాల్సి వచ్చి, అవి పూర్తిగా పాడైపోతాయని ఇరిగేషన్ ఇంజనీర్లు స్పష్టంగా చెబుతున్నారని వివరించారు. నదిలో వరద వచ్చినప్పుడు మోటార్లు రౌండ్ ద క్లాక్ నడిపితే తప్ప ప్రాజెక్టులు నిండవని, ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో కాళేశ్వరం, దేవాదుల, నెట్టెంపాడు లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు. అంతేకాకుండా రోజుకు 18 నుంచి 20 గంటలు నడిస్తే తప్ప మిషన్ భగీరథ లాంటి తాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఇంటింటికీ నీళ్లు అందవని, ఎండ రాని వాతావరణంలో తాగునీటి పథకాలు కూడా ఆగిపోయి ప్రజలు అల్లాడిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం వినియోగదారులు కోరితే ఎవరికైనా కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని, కానీ ఆర్పీడీసీఎల్ విధానం వల్ల వ్యవసాయ బావుల వద్ద ఇల్లు కట్టుకున్నా, కోళ్ల ఫారం పెట్టుకున్నా కరెంట్ ఇవ్వరని తెలిపారు. దీనికోసం మళ్లీ ఎస్పీడీసీఎల్ నుంచి కిలోమీటర్ల కొద్దీ పోల్స్ వేసుకుని, డబుల్ లైన్లు లాగితేనే కనెక్షన్ ఇస్తారని, తద్వారా ఒకే దగ్గర రెండు లైన్లు, రెండు స్తంభాలు వేయాల్సి వచ్చి రైతుల భూములు పాడవడంతో పాటు, ప్రజా ధనం భారీగా వృథా అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాలు వచ్చే డిస్కంలను ముంబై, బెంగళూరు తరహాలో ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టి, ఉచిత కరెంటును పక్కన పెట్టే కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి ఈ మూడో డిస్కం ఏర్పాటు చేస్తున్నారని, ఇదొక తుగ్లక్ చర్య అని మండిపడ్డారు. దీనిపై తక్షణమే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.
డిస్కంలు అప్పుల పాలైంది బీఆర్ఎస్ వల్లే అని ముఖ్యమంత్రి మాట్లాడటం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనం అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో డిస్కంలకు ప్రభుత్వం బకాయి పడింది 27 వేల కోట్లు అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేవలం ఈ కొద్ది కాలంలోనే ఏకంగా 25,284 కోట్లు బకాయి పడిందని లెక్కలతో సహా వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి పది వేల కోట్ల చొప్పున అప్పులపాలు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారమే డిస్కంల మొత్తం అప్పు 55 వేల కోట్లుగా ఉందని గుర్తుచేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సబ్ స్టేషన్లను, ట్రాన్స్ఫార్మర్లను, విద్యుత్ లైన్లను భారీగా పెంచామని, కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. గత కాంగ్రెస్ పాలనలో తండ్రి చనిపోతే స్నానం చేయడానికి కరెంట్ లేక నెత్తి మీద నీళ్లు చల్లుకొని వచ్చామని సాక్షాత్తూ రేవంత్ రెడ్డే అసెంబ్లీలో చెప్పారని, ఆ చీకటి రోజులను పోగొట్టి విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసింది కేసీఆర్ గారేనని ఆయన గర్వంగా చెప్పారు.
పూటకో పార్టీ మారే రేవంత్ రెడ్డికి తన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. దేవుళ్ల మీద ఒట్టేసి రుణమాఫీ ఎగబెట్టిన రేవంత్ రెడ్డి తన ఇంటి పేరును అబద్ధాల రేవంత్ రెడ్డిగా మార్చుకోవాలని చురకలంటించారు. 45 రోజుల్లో రైతు బంధు ఇస్తానని సిద్దిపేటకొచ్చి మాట తప్పింది నువ్వు కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు. తన జీవితమంతా కేసీఆర్ గారి వెంటేనని, తన పుట్టుక, ప్రయాణం అంతా బీఆర్ఎస్ తోనే అని ఆయన ఉద్ఘాటించారు. రైతులకు తీవ్ర నష్టం చేకూర్చే ఆర్పీడీసీఎల్ ఏర్పాటును వెంటనే రద్దు చేయాలని, రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ పక్షాన పెద్ద ఎత్తున విద్యుత్ ఉద్యమాన్ని నిర్మిస్తామని హరీశ్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.