- పాలన పక్కనపెట్టి పబ్లిసిటీకే ప్రాధాన్యమిస్తున్న రేవంత్ రెడ్డి
- హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్
- మున్సిపల్, హోం, విద్యా శాఖలను నిర్లక్ష్యం చేసిన రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి
- ఉద్యోగాలు రాక, ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తు అంధకారం
- బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్
హైదరాబాద్, మహా : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ శ్రీ ఎన్.వి. సుభాష్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు అశోక్ ముస్తాపురే, సందీప్ సాయి, మీడియా ప్యానెలిస్ట్ లు రాజు ముదిరాజ్, సురేష్ గౌడ్ లతో కలిసి ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు 100 రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈరోజు వరకు ఏ ఒక్క శాఖలోనూ విజయం సాధించలేకపోయింది. పాలనను గాలికొదిలేసి కేవలం ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీల ద్వారా పేపర్, టీవీ ప్రకటనలతో మౌత్ పబ్లిసిటీ చేసుకోవడానికే ప్రాధాన్యమిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపై ఏకంగా 1,000 పేజీల పుస్తకాన్ని ప్రచురించే పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు.
యువత, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం
ఎన్నికల ముందు అశోక్ నగర్‌కు రాహుల్ గాంధీని తీసుకొచ్చి నిరుద్యోగులకు ‘జాబ్ గ్యారెంటీ’ పేరుతో డ్రామాలు ఆడారని, తీరా అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్‌ను పూర్తిగా పక్కనబెట్టారని సుభాష్ విమర్శించారు. రూ. 14,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బాకీలను విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వక దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన ప్రభుత్వమే వారిని “క్రిమినల్ వేస్ట్” అని సంబోధించడం అత్యంత దురదృష్టకరం. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు.
ఫ్యూచర్ సిటీ కాదు ‘ఫ్యూచర్-లెస్’ సిటీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనల పేరుతో పదే పదే తిరుగుతున్నారే తప్ప, రాష్ట్రానికి తీసుకొచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం చేయడం లేదని సుభాష్ ఎద్దేవా చేశారు. ఫ్యూచర్ సిటీ పేరుతో కాలయాపన చేస్తూ తెలంగాణను “ఫ్యూచర్-లెస్” సిటీగా మార్చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ స్టార్టప్ ఇండియా ద్వారా దేశంలో యువతకు అనేక అవకాశాలు కల్పిస్తుంటే, తెలంగాణలో మాత్రం విద్యార్థులు, నిరుద్యోగులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడేలా కాంగ్రెస్ పాలన తయారైందని ఎన్.వి.సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి
హోం, మున్సిపల్, విద్యా శాఖలను తన వద్దే పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మూడింటిలోనూ ఘోరంగా విఫలమయ్యారని ఎన్.వి. సుభాష్ ఆరోపించారు. గురుకులాలకు అద్దెలు చెల్లించక తాళాలు పడుతుంటే, నాణ్యమైన భోజనం లేక విద్యార్థులు తీవ్ర అస్థవ్యస్థ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షానికే నగరం జలమయమై, ట్రాఫిక్ స్తంభించిపోతోంది. కేవలం రియల్ ఎస్టేట్, ఆర్థిక ప్రయోజనాల కోసమే ఈ శాఖను తన వద్దే ఉంచుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ పూర్తిగా విఫలమైంది. దేవాలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోకుండా, బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జీలు చేయడానికే పోలీసులను వాడుకుంటున్నారు. ఈ మూడు ముఖ్యమైన శాఖలను సమర్థవంతంగా నిర్వహించలేకపోయిన రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని సుభాష్ వెల్లడించారు.
ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు బిజెపి సిద్ధం
గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో నష్టపోయిన ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీవ్రంగా మోసం చేస్తోంది. పార్లమెంట్లోగానీ, రాష్ట్రంలోగానీ బీఆర్ఎస్ పాత్ర శూన్యంగా మారింది. కాంగ్రెస్ వైఫల్యాలను, ప్రజావ్యతిరేక విధానాలను రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజల ముందుకు తీసుకెళ్తామని, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే తెలంగాణకు సమర్థవంతమైన పాలన అందుతుందని సుభాష్ ధీమా వ్యక్తం చేశారు.








