Mahaa Daily Exclusive

  శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే….

Share

  • శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే
  • అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు
  • యూఎస్ సైనిక స్థావరాలే టార్గెట్ గా సాగిన ఇరాన్ దాడులు
  • అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు

టెహ్రాన్, మహా : అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పంద ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. బుధవారం కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మిస్సైల్స్, డ్రోన్లతో దాడి చేసింది. వెంటనే స్పందించిన అమెరికా సైన్యం ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. ఇరాన్‌కు చెందిన కేశమ్ ఐలాండ్ సహా ఇతర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది.

యూఎస్ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ తన పొరుగు దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. అయితే ఇవన్నీ విఫలమయ్యాయని సెంట్రల్ కమాండ్ తెలిపింది. కువైట్‌లో ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు లక్ష్యాన్ని చేరుకోలేదు. వాటిని మార్గంమధ్యంలోనే అడ్డుకుని ధ్వంసం చేశామని తెలిపింది. బహ్రెయిన్‌పై ఇరాన్ ప్రయోగించిన 3 క్షిపణులను యూఎస్, బహ్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకున్నాయి. ‘బహ్రెయిన్‌లోని అమెరికా 5వ ఫ్లీట్ హెడ్‌క్వార్టర్స్, ఆ ప్రాంతంలో ఉన్న ఒక అమెరికన్ ఎయిర్‌బేస్‌పై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ క్లెయిమ్ చేసింది. ఇది ముమ్మాటికీ అబద్ధం. అమెరికా సైన్యంపై ఇరాన్ చేసిన దాడులన్నీ విఫలమయ్యాయి. అమెరికా సైన్యం అప్రమత్తంగా ఉండి ఇరాన్ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. ఇరాన్ నుంచి ఎలాంటి దాడులు, దురాక్రమణనైనా ఎదుర్కొని తిప్పి కొట్టేందుకు యూఎస్ ఆర్మీ సిద్ధంగా ఉంది’ అని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ ఖాతాలో పేర్కొంది.

కువైట్ లో మోగుతున్న సైరన్ లు

ఈ దాడి తర్వాత కువైట్‌లో ప్రమాద హెచ్చరిక సైరన్లు మోగుతున్నాయి. ఆ ప్రాంతాల్లోని ప్రజలు భద్రతా సూచనలను పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కువైట్ సైన్యం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ లో.. ‘కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రస్తుతం మిస్సైల్స్, డ్రోన్ దాడులను ఎదుర్కొంటోంది. ఒకవేళ పేలుడు శబ్దాలు వినిపిస్తే, అది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాడులను అడ్డుకోవడం వల్ల వచ్చిన శబ్దమని గ్రహించాలి. అధికారులు జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను ప్రజలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని పోస్ట్ చేసింది.

ఇరాన్‌తో శాంతి చర్చలు కొనసాగుతున్నాయి: ట్రంప్

కాగా, ఇరాన్‌తో శాంతి చర్చలు నిరంతరం కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్‌తో చర్చలు నిలిచిపోయాయన్న వార్తలను ఖండిస్తూ, నిన్న, నేడు కూడా తమ మధ్య సందేశాల మార్పిడి జరిగిందని ‘ట్రూత్ సోషల్’ వేదికగా మంగళవారం తెలిపారు. అయితే ఈ చర్చల ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. మరోవైపు, యుద్ధ ముగింపునకు అమెరికాతో కుదిరే ఏ ఒప్పందంలోనైనా లెబనాన్ అంశమే కీలకమని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘాలిబఫ్ స్పష్టం చేశారు. ఇరాన్ ఎంత పట్టుబడుతున్నప్పటికీ, లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం మాత్రం దాడులు ఆగడం లేదు. తాజాగా దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడుల్లో పలువురు మరణించారు. ఒకవైపు దాడులు జరుగుతున్నా, శాంతి కోసం ఇరు దేశాల చర్చలు మాత్రం కొనసాగుతున్నాయి.