Mahaa Daily Exclusive

  అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ పాలన….

Share

అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ పాలన.
* రాష్ట్ర ఆర్థిక విధ్వంసానికి సీఎం రేవంత్ బాధ్యత వహించాలి.
* దమ్ముంటే కొనుగోళ్లు, అప్పుల లెక్కలపై బహిరంగ చర్చకు రావాలి.
* కేంద్రం నిధులతో కట్టిన ఇళ్లకు ‘ఇందిరమ్మ’ పేరా?
* ధాన్యం చివరి గింజ కొనకుంటే సీఎం ఇంటి ముందే పోస్తాం.
* కాంగ్రెస్ తీరుపై నిప్పులు చెరిగిన బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
హైదరాబాద్, మహా.
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను గాలికొదిలేసి కేవలం అబద్ధాలు, అతిశయోక్తులు, ప్రగల్భాలకే పెద్దపీట వేస్తోందని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతి విషయంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని లక్ష్యంగా చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. తాను చెప్పే ప్రతి అంశానికీ పక్కా ఆధారాలు ఉన్నాయని.. దమ్ముంటే ముఖ్యమంత్రి తన మంత్రివర్గంతో కలిసి ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బహిరంగ చర్చకు (ఓపెన్ డిబేట్) రావాలని సవాల్ విసిరారు.
**ధాన్యం కొనుగోళ్లలో ఘోర వైఫల్యం.. రైతుల ఉసురు తీస్తున్న సర్కార్**
ఎన్నికల సమయంలో రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు.. నేడు అధికారంలోకి వచ్చాక పూర్తిగా చేతులెత్తేశారని మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో సుమారు 1.41 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే.. తొలుత 90 లక్షలు, ఆ తర్వాత 75 లక్షల టన్నులు కొంటామని మాట మార్చి, చివరకు కేవలం 64 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకే పరిమితం కావడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. కొనుగోలు కేంద్రాలు మూసివేయడంతో మార్కెట్ యార్డుల్లో ధాన్యం కుప్పల వద్ద రైతులు ఎండలో పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. బీజేపీ చేపట్టిన ‘రైతు గోస-బీజేపీ భరోసా’ యాత్రతో బండారం బయటపడటంతోనే ప్రభుత్వం హడావుడిగా కొనుగోళ్లను వేగవంతం చేసే ప్రయత్నం చేసిందని పేర్కొన్నారు.
గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రతి గింజా కొని విదేశాలకు ఎగుమతి చేస్తానన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే రాష్ట్ర పరిస్థితి ఏంటి? అని ముఖ్యమంత్రి అడగటం ఆయన బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా కేంద్రం కొనే వడ్లలో 60 శాతం కేవలం తెలంగాణ నుంచే ఉంటున్నాయన్న వాస్తవాన్ని గ్రహించాలన్నారు. వడ్లతో పాటు మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు తదితర పంటల కొనుగోళ్లలోనూ సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయకపోతే, రైతుల పక్షాన భారీ ఆందోళన చేపట్టి, ఆ ధాన్యాన్ని నేరుగా ముఖ్యమంత్రి ఇంటి ముందే పోస్తామని హెచ్చరించారు.
**కేంద్రం నిధులతో ‘ఇందిరమ్మ’ పేరా? ప్రాజెక్టులపై ప్రగల్భాలా?**
గృహ నిర్మాణ పథకం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేస్తోందని ఏలేటి విమర్శించారు. రాష్ట్రంలో లక్ష ఇళ్లు నిర్మించామని ప్రభుత్వం చెబుతున్న మాటలు పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు. గత బడ్జెట్‌లో గృహ నిర్మాణానికి కేటాయించిన ఏడు వేల కోట్లలో, 4,644 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులేనని లెక్కలతో సహా వివరించారు. లక్ష ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను కనీసం సమకూర్చకుండా.. వంద శాతం కేంద్రం ఇచ్చిన డబ్బులతో ఇళ్లు కట్టి వాటికి ‘ఇందిరమ్మ ఇళ్లు’ అని పేరు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. ఇక ప్రాణహిత, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుల విషయంలో కనీస అంతర్ రాష్ట్ర ఒప్పందాలు, డీపీఆర్‌లు లేకుండా, కేంద్ర అనుమతుల ప్రక్రియ పూర్తి చేయకుండా నెపాన్ని కేంద్రంపై నెట్టడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.
**ఆర్థిక విధ్వంసం.. అప్పు పుడితే కానీ పూట గడవని దారుణ పరిస్థితి**
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద నడిపిస్తూ, ఆర్థికంగా పూర్తిగా విధ్వంసం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి 58 వేల కోట్లు కాగా, కేవలం తొలి నెలలోనే రేవంత్ సర్కార్ 11 వేల కోట్ల రూపాయల మేర అప్పు తెచ్చుకుందని దుయ్యబట్టారు. ఇదే తీరుగా అప్పులు చేస్తే నాలుగైదు నెలల్లోనే కోటా పూర్తవుతుందని, ఆ తర్వాత మిగిలిన ఏడెనిమిది నెలల పాటు రాష్ట్రాన్ని ఎలా నడుపుతారని నిలదీశారు. బాకీ తెచ్చుకుంటే తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సైతం ఇవ్వలేని దారుణ పరిస్థితుల్లో నేడు రాష్ట్రం ఉందన్నారు. ప్రతి వారం 2,500 కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉందని స్వయంగా రాష్ట్ర ఆర్థిక మంత్రే అంగీకరిస్తుంటే, ముఖ్యమంత్రి మాత్రం మూసీ ప్రక్షాళనకు లక్ష కోట్లు, ప్రాణహితకు లక్ష కోట్లు అంటూ గాలి మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రాజెక్టులు కట్టడానికి ఆర్థిక వనరుల సమీకరణపై కనీస ప్రణాళిక లేకుండా, కేవలం కాగితాలపై ప్రకటనలు చేసి టెండర్లు పిలిచి తమకు అనుకూలమైన వారికి కట్టబెట్టే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. సొంతంగా నిధులు సమకూర్చుకోకుండా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని తిడితే ఇక్కడ పనులు జరగవని హితవు పలికారు. రాష్ట్రాన్ని ఇంతటి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే కనీస నైతిక అర్హత లేదని, తక్షణమే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు అబద్ధాలు మానుకుని వాస్తవాల్లో బతకాలని, ఆర్థిక విధ్వంసాన్ని ఆపేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిపాలనాపరంగా కుంటుపడిన తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం.. కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.