Mahaa Daily Exclusive

  అన్నదాతకు ఆగచాట్లు….

Share

అన్నదాతకు ఆగచాట్లు…

పలావ్ సూపర్ గా వుంది… బగారా కర్రీ భలే టెస్ట్ భేష్… పులిహోర రుచి అద్భుతం… టమాట పప్పు అహో అన్పించింది…అన్నదాత సుఖీభవ…రుచిగా, తృప్తిగా భోజనం చేసినప్పుడు మనం అనుకునే మాటలు ఇవి… కానీ మనకు కడుపు నిండా భోజనం తినే అవకాశం ఇస్తున్న రైతును మాత్రం ససేమిరా గుర్తు చేసుకోం… అసలు ఆ ప్రస్తావనే రాదు… రోజు మనం అన్నం తింటున్నాం… చేతులు కడిగేసుకుంటున్నాం… మరి కంచంలోకి ఆ ముద్ద తెచ్చే వరకు శ్రమించిన రైతు గురించి ఏ మాత్రం ఆలోచించం… ఇది మానవ నైజం… ఆరుగాలం శ్రమించి, తన కష్టంతో రైతు పండించే ధాన్యమే మన కడుపు నింపి ఆకలి బాధ తీరుస్తోంది… ఇది అందరికి తెలిసిన నిజమే… ఒక్క క్షణం రైతు కష్టం గురించి ఆలోచిస్తే మాత్రం మనం తినే ప్రతీ ముద్దకు ఆ రైతుకు దండం పెట్టాల్సిందే… కాలం మారినా, తరాలు మారినా, చివరికి ప్రభుత్వాలు, పాలకులు మారినా అన్నదాత బతుకులు మాత్రంఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే వుంది… వ్యవసాయం చేసి బాగు పడిన రైతులు కేవలం పదుల సంఖ్యలో మాత్రమే వుంటున్నారు అన్నది పచ్చి నిజం… అన్నదాతల కోసం అది చేస్తున్నాం, ఇది ఇస్తున్నాం అంటూ పాలకులు పదే పదే చెప్తున్నా మాటలు కోటలు దాటు తూనే వున్నాయి…క్షేత్ర స్థాయిలో రైతుల దీనస్థితి ఇప్పటికి మారలేదు… వ్యవసాయం అంటే అదృష్టం అనే పరిస్థితి ఇప్పుడు రైతుకు తప్పట్లేదు… ఇటు ఖరీఫ్, అటు రబీ సీజన్ వస్తోంది అంటే భుజాన నాగలి వేసుకొని రైతు పొలం బాట పడుతున్నాడు. ప్రతీ ఏడాది ఓ కొత్త ఆశతో పొలం పనులు మొదలు పెడుతున్న అన్నదాతకు వరుణుడు శత కోటి పరీక్షలు పెడుతూనే వున్నాడు… వర్షాకాలం వస్తోంది అంటే దుక్కిదున్నీ పంట కోసం పొలం సిద్ధం చేస్తున్న రైతులు చినుకుల కోసం ఆకాశం వైపు చకోర పక్షి లాగా ఎదురు చూడక తప్పట్లేదు… ఇక అతివృష్టి, అనావృష్టిలు అన్నదాతను వీడవ టమే లేదు… అయినా మొక్కవోని ధైర్యంతో రైతు వ్యవసాయం చేస్తూనే వున్నాడు… ఇప్పుడు వ్యవసాయ రంగంలో తెలంగాణ రైతులు సత్తా చాటుతున్న తీరు ఇక్కడ చెప్పుకోవల్సిందే…