Mahaa Daily Exclusive

  ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి….

Share

ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి…
– తెలంగాణ రైతాంగానికి వరం కానున్న కోహెడ అంతర్జాతీయ సమీకృత మార్కెట్
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో ప్రపంచ స్థాయి మార్కెట్ నిర్మాణం
– ముఖ్యమంత్రి  కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఇబ్రహీంపట్నం జూన్ 5 మహా:
  తెలంగాణ రైతాంగ భవిష్యత్తుకు కొత్త దిశానిర్దేశం చేసే కోహెడ అంతర్జాతీయ సమీకృత మార్కెట్ రాష్ట్ర వ్యవసాయ రంగ అభివృద్ధిలో మైలురాయిగా నిలవనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి కోహెడలో ప్రారంభించనున్న కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు.
  ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ… గతంలో నిలిచిపోయిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో పునరుద్ధరించి అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) అనుసంధానం, రవాణా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని కోహెడ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. 239 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న ఈ మార్కెట్‌లో పండ్లు, కూరగాయలు, పూలు, మాంసం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు–అమ్మకాలు, ఎగుమతి–దిగుమతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆధునిక గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, లాజిస్టిక్స్ పార్కులు, ప్రాసెసింగ్ యూనిట్లు, రవాణా కేంద్రాలు వంటి ప్రపంచ స్థాయి మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మూడు దశల్లో మార్కెట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, తొలి దశ పనులను వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, రైతు భరోసా, రైతు బీమా, పంటల కొనుగోలు వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు విస్తృత స్థాయిలో మద్దతు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
  ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… కోహెడ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తెలంగాణ వ్యవసాయ, ఉద్యానవన రంగాల అభివృద్ధికి నూతన ఊపునివ్వనుందని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానం చేయడం ఈ మార్కెట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
  ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ… కోహెడలో నిర్మించనున్న అంతర్జాతీయ స్థాయి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తెలంగాణ రైతాంగానికి, వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా నిలవనుందని, సుమారు 239 ఎకరాల్లో, ఔటర్ రింగ్ రోడ్‌కు ఆనుకుని నిర్మించనున్న ఈ మార్కెట్ దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించే అవకాశం కల్పించడంతో పాటు, వినియోగదారులు ఒకే చోట నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నగరానికి మణిహారంగా నిలిచే ఈ మార్కెట్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, మార్కెట్‌లోని ధరలు, లభ్యమయ్యే ఉత్పత్తుల వివరాలు ప్రజలు ఇంటి నుంచే తెలుసుకునే విధంగా వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రైతు–వినియోగదారుల మధ్య ప్రత్యక్ష అనుసంధానం కల్పించడం ద్వారా రైతులకు మెరుగైన ధరలు, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు, ప్రజాప్రతినిధులు, సభ్యులు హాజరుకానుండగా, వారి రవాణా, పార్కింగ్, తాగునీరు, భద్రత, విశ్రాంతి తదితర సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రదర్శనలు, సమాచార కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ సంస్థ ఛైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, రాష్ట్ర వ్యవసాయం & సహకార శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ గోపి, మార్కెట్ కమిటీ చైర్మన్  చిలుక మధుసూదన్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.