ప్రపంచస్థాయికి ఆంధ్రా రొయ్య.
* బ్లూ ఎకానమీకి ఏపీనే కేంద్ర బిందువు.
* విశాఖ ఆక్వా సదస్సులో ముఖ్యమంత్రి వెల్లడి.
* అమరావతి నుంచి నెల్లూరు వరకు ‘ఆక్వా కారిడార్’ అభివృద్ధి.
* దేశ సముద్ర ఆహార ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 38 శాతం.
* కేంద్ర మత్స్య శాఖ ప్రాంతీయ కార్యాలయానికి 15 రోజుల్లో స్థలం.
* ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.
అమరావతి, మహా.
భవిష్యత్తంతా బ్లూ ఎకానమీ (నీలి విప్లవం) దేనని, భారతదేశ సముద్ర ఆర్థిక వ్యవస్థకు ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన కేంద్ర బిందువుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవడంలో ఆక్వా రంగం అత్యంత కీలక పాత్ర పోషించనుందని ఆయన ఉద్ఘాటించారు. విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించిన ‘సీ-ఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్‌షాప్’కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధం చేసిన బృహత్ ప్రణాళికలను, దార్శనికతను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
భారతదేశ సముద్ర ఆహార ఉత్పత్తులు, ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అగ్రగామిగా కొనసాగుతోందని చంద్రబాబు గణాంకాలతో సహా వివరించారు. దేశం మొత్తమ్మీద జరిగే చేపల ఉత్పత్తిలో 28 శాతం, రొయ్యల ఉత్పత్తిలో ఏకంగా 66 శాతం వాటా ఏపీదేనని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా, దేశ సముద్ర ఆహార ఎగుమతుల ద్వారా లభించే ఆదాయంలో 38 శాతం, అంటే దాదాపు రూ.28,000 కోట్లకు పైగా ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే సమకూరుతోందని గుర్తుచేశారు. అయితే, ప్రపంచ సీ-ఫుడ్ వ్యాపారంలో భారతదేశ వాటా ప్రస్తుతం కేవలం 5 శాతంగానే ఉందని, దీనిని మరింత విస్తరించేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఆక్వా రంగం వృద్ధి చెందితే దేశ ఎగుమతులు కూడా దానంతట అదే పెరుగుతాయన్న ఆయన, అంతర్జాతీయ మార్కెట్లో ‘ఆంధ్రా ష్రింప్.. ఇండియా సీ-ఫుడ్’ అనే ఒక శక్తివంతమైన బ్రాండ్‌ను ప్రతిష్టించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని సమగ్రంగా బలోపేతం చేసేందుకు అమరావతి, భీమవరం, కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం, నెల్లూరు ప్రాంతాలను కలుపుతూ ఒక సుదీర్ఘ ‘ఆక్వా కారిడార్’ను అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ కారిడార్ పరిధిలో అత్యాధునిక పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, అధునాతన సాంకేతికతతో కూడిన ఒక సంపూర్ణ ఎకో సిస్టమ్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. అతి తక్కువ పెట్టుబడితో నాణ్యమైన, అత్యధిక ఉత్పత్తిని సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్తూ.. ‘పాండ్ టు పోర్టు, ఫార్మర్ టు గ్లోబల్ కన్స్యూమర్’ (చెరువు నుంచి ఓడరేవు వరకు.. రైతు నుంచి ప్రపంచ వినియోగదారుడి వరకు) అనే వినూత్న విధానంతో ముందుకు సాగుతామని భరోసా ఇచ్చారు.
ఆక్వా రంగ పురోగతి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి సంస్కరణకు, చర్యకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా కేంద్ర మత్స్య శాఖ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కోసం 15 రోజుల్లోగా అనువైన స్థలాన్ని కేటాయిస్తామని ప్రకటించారు. కాకినాడ పోర్టు ఆధునికీకరణకు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సానుకూలంగా స్పందించడంపై హర్షం వ్యక్తం చేస్తూ, మెగా సీ-ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు కేంద్రం అందిస్తున్న మద్దతును కొనియాడారు.
ఇదే క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని శ్లాఘిస్తూ, 21వ శతాబ్దం మోదీదేనని, దేశాన్ని భవిష్యత్తులో అగ్రస్థానంలో నిలిపేందుకు ఆయన అద్భుతంగా కృషి చేస్తున్నారని, ప్రధానిని మరింత బలపర్చాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. సదస్సుకు తాను సైకిల్‌పై వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, సైక్లింగ్ వల్ల ఆరోగ్యంతో పాటు పొదుపు సాధ్యమవుతుందని సూచించారు. ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆక్వా ఉత్పత్తులను ఆహారంలో భాగం చేసుకుని ప్రజలంతా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.








