నటి సుకన్యకు రూ.10 లక్షల పరిహారం.
* 30 ఏళ్ల క్రితం నాటి ‘వీరప్పన్’ కేసులో హైకోర్టు తీర్పు!
* గంధపు చెక్కల స్మగ్లర్ ఇంటర్వ్యూ ప్రసారంపై సన్ టీవీకి చుక్కెదురు.
* దిగువ కోర్టు తీర్పును సమర్థించిన మద్రాస్ హైకోర్టు.
చెన్నై, మహా.
దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం ప్రముఖ దక్షిణాది నటి సుకన్యకు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఆమెపై చేసిన పరువునష్టం కలిగించే ఆరోపణలను ప్రసారం చేసినందుకు గాను.. సన్ టీవీ నెట్వర్క్ ఆమెకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాల్సిందేనని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. సుకన్యకు పరిహారం చెల్లించాలంటూ గతంలో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం తాజాగా సమర్థించింది.
* ఏమిటీ వివాదం?
1996 ఏప్రిల్ 17న సన్ టీవీలో ప్రసారమైన ‘నేరుక్కు నేర్’ అనే కార్యక్రమంలో ఈ వివాదానికి బీజం పడింది. ఆ సమయంలో తమిళ పత్రిక ‘నక్కీరన్’ ఎడిటర్ ఆర్.ఆర్. గోపాల్.. స్మగ్లర్ వీరప్పన్‌ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ సందర్భంగా వీరప్పన్ మాట్లాడుతూ.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమారుడితో నటి సుకన్యకు అక్రమ సంబంధం ఉందంటూ తీవ్ర నిరాధార ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా, 1996 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సుకన్యకు సంబంధించిన కొన్ని వీడియోలను వినియోగించుకున్నారని కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
*సుదీర్ఘ న్యాయపోరాటం..
వీరప్పన్ చేసిన ఈ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, వాటి వల్ల సమాజంలో తన కీర్తి ప్రతిష్ఠలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తూ నటి సుకన్య కోర్టును ఆశ్రయించారు. ఈ నిరాధార ఆరోపణలు తనను మానసికంగా ఎంతో కుంగదీశాయని ఆమె అప్పట్లో తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన ట్రయల్ కోర్టు.. 2015లో సుకన్యకు అనుకూలంగా తీర్పునిస్తూ, ఆమెకు రూ.10,00,500 నష్టపరిహారం చెల్లించాలని సన్ టీవీని ఆదేశించింది. అయితే, ఆ తీర్పును సవాల్ చేస్తూ సన్ టీవీ నెట్వర్క్ మద్రాస్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది.
*సన్ టీవీ తప్పిదమేనన్న ధర్మాసనం.
సన్ టీవీ దాఖలు చేసిన అప్పీల్‌ను తాజాగా జస్టిస్ కె. కుమరేశ్ బాబు నేతృత్వంలోని మద్రాస్ హైకోర్టు ధర్మాసనం విచారించి.. టీవీ ఛానల్ వాదనలను పూర్తిగా తోసిపుచ్చింది. ఒక ఇంటర్వ్యూను ప్రసారం చేసే ముందు దానిలోని అభ్యంతరకర, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలను విశ్లేషించుకోవడంలోనూ, వాటిని తొలగించడంలోనూ బ్రాడ్‌కాస్టర్ దారుణంగా విఫలమైందని కోర్టు తప్పుబట్టింది. సదరు కార్యక్రమంపై పూర్తి ఎడిటోరియల్ నియంత్రణ ఉన్నప్పటికీ, ఆ వివాదాస్పద కంటెంట్‌ను కనీసం ఎడిట్ చేయకుండా యథాతథంగా ప్రసారం చేయడం సన్ టీవీ తప్పేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే దిగువ కోర్టు తీర్పును సమర్థిస్తూ సన్ టీవీ నెట్వర్క్ సుకన్యకు పరిహారం చెల్లించాల్సిందేనని తుది తీర్పు వెలువరించింది. నటి సుకన్య 1980, 90వ దశకాల్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి దక్షిణాది సినీ ప్రేక్షకులకు ఎంతగానో చేరువైన విషయం తెలిసిందే.







