రాష్ట్రానికి చల్లని కబురు.
* రాగల ఏడు రోజులు ఈదురుగాలులతో వర్షాలు!
* జూన్ 9 నుంచి భారీగా పడిపోనున్న ఉష్ణోగ్రతలు.
* ఉమ్మడి ఖమ్మం సహా పలు జిల్లాలకు ఎండల నుంచి ఉపశమనం.
* వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా వేసవి తాపంతో అల్లాడుతున్న ఉమ్మడి ఖమ్మం సహా పలు జిల్లాల వాసులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాల కదలికలు, వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలో రాగల ఏడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆదివారం విడుదల చేసిన తాజా బులెటిన్‌లో స్పష్టం చేసింది. ఈ వానల రాకతో గత కొద్ది రోజులుగా 40 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోయి, వాతావరణం పూర్తిగా చల్లబడనుందని అధికారులు వెల్లడించారు. ఎండలు, వడగాల్పులతో అల్లాడుతున్న అన్నదాతలకు, సాధారణ ప్రజానీకానికి ఈ వాతావరణ మార్పులు తీవ్ర ఉపశమనాన్ని కలిగించనున్నాయి.
వాతావరణ శాఖ సూచనల ప్రకారం, సోమవారం ఉదయం వరకు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ తదితర జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భీకరమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. అదే విధంగా జూన్ 8 నుంచి జూన్ 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా జూన్ 10, 11 తేదీల్లో (నాలుగో రోజు) ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ఇతర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఈ సమయంలో చెట్ల కింద, పాత ఇళ్ల వద్ద ఆశ్రయం పొందవద్దని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
ఉష్ణోగ్రతల విషయానికి వస్తే.. రాగల మూడు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండకపోయినప్పటికీ, జూన్ 9వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోనున్నాయి. వాతావరణ శాఖ విడుదల చేసిన ఐదు రోజుల ఉష్ణోగ్రతల అంచనా ప్రకారం.. జూన్ 8 తేదీల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ తదితర జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతాయి. అయితే, జూన్ 9వ తేదీ నాటికి వాతావరణం పూర్తిగా చల్లబడి ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్ సహా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 36 డిగ్రీల కంటే దిగువకు పడిపోనున్నాయి. ఇది రాబోయే వ్యవసాయ సీజన్‌కు సిద్ధమవుతున్న రైతులకు, పత్తి, వరి నార్లు పోసుకునేందుకు ఎంతో అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించనుంది.
ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పలు కీలక సూచనలు చేసింది. వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు వాతావరణం ఒక్కసారిగా మారినప్పుడు, ముఖ్యంగా మెరుపులు వస్తున్న సమయంలోరు పొలాల్లో ఉండకూడదని, సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలని సూచించింది. బలమైన ఈదురుగాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, పాత చెట్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున ప్రయాణాల్లో ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు నీటి నిల్వల పట్ల అప్రమత్తంగా ఉండి మున్సిపల్, విపత్తు నిర్వహణ అధికారుల సూచనలు పాటించాలని వాతావరణ కేంద్రం డైరెక్టర్ వెల్లడించారు. మొత్తంగా రాబోయే వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా తొలకరి పలకరింపులతో వ్యవసాయ పనులకు ఊపురానుంది.








