Mahaa Daily Exclusive

  తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు….

Share

తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు.
* అన్నామలై కొత్త ప్రజా ఉద్యమం ‘వీ ది లీడర్’!
* అబ్దుల్ కలాం ఆశయాలతో నూతన రాజకీయ ప్రయాణం.
* ప్రారంభమైన కొద్ది గంటల్లోనే లక్షల్లో వెల్లువెత్తిన సభ్యత్వాలు.
* రానున్న లోక్‌సభ బరిలో పోటీకి సిద్ధమన్న మాజీ ఐపీఎస్.
చెన్నై, మహా.

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య, అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణను ప్రకటించారు. జూన్ 5వ తేదీన కమలం పార్టీతో బంధం తెంచుకున్న ఆయన, సరికొత్త దిశలో అడుగులు వేస్తూ **’వీ ది లీడర్’** పేరుతో ఒక నూతన ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దేశ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆలోచనలు, సిద్ధాంతాల స్ఫూర్తితో ఈ వేదికను తీర్చిదిద్దినట్లు ఆయన ప్రకటించారు. ఈ నూతన ఆవిష్కరణకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ప్రారంభించిన కొద్ది గంటల వ్యవధిలోనే వెబ్‌సైట్ ద్వారా లక్షలాది మంది ఈ ఉద్యమంలో సభ్యత్వం స్వీకరించడం విశేషం.
**కలాం సిద్ధాంత పాఠశాల ఆధ్వర్యంలో..**
తమిళ సమాజానికి చెందిన గొప్ప జాతీయ నాయకుడు అబ్దుల్ కలాంను దేశభక్తి, అంకితభావం, కఠిన శ్రమ, సమైక్యతలకు నిలువెత్తు ప్రతీకగా అన్నామలై అభివర్ణించారు. ఆ మహనీయుని పేరుతో కోయంబత్తూరు కేంద్రంగా ‘కలాం సిద్ధాంత పాఠశాల’ను స్థాపించనున్నారు. నైతికత, రాజకీయాల అధ్యయన కేంద్రంగా రూపుదిద్దుకోనున్న ఈ వేదిక.. దానికి అనుబంధంగా పనిచేస్తూ యువతలో ప్రజా నాయకత్వ వికాసానికి, పరిశోధనలకు, శిక్షణకు ప్రధాన వేదికగా నిలవనుంది. కలాం ఆలోచనలను కేంద్రబిందువుగా చేసుకుని తమిళనాట ఒక సరికొత్త రాజకీయ సంభాషణకు అన్నామలై నాంది పలికారు.
**బీజేపీకి గుడ్‌బై చెప్పడానికి కారణమిదే..**
ప్రభుత్వ సర్వీసులను వదిలి 2020లో రాజకీయ ప్రవేశం చేసిన అన్నామలై, అనతికాలంలోనే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా.. ఆ తర్వాత కేవలం 37 ఏళ్ల వయసులో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, తన రాజీనామా లేఖలో ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గత ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర రాజకీయాల దిశానిర్దేశంపై పార్టీ అధిష్ఠానంతో అనేక దఫాలుగా చర్చలు జరిగాయని, అయితే కొన్ని కీలక అంశాల్లో ఇరువర్గాల మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు తలెత్తాయని స్పష్టం చేశారు. తమిళనాడు భవిష్యత్ రాజకీయాలపై తనకున్న ఆలోచనలు, పార్టీ జాతీయ నాయకత్వం దృక్పథం ఒకే రీతిన లేవన్న స్పష్టమైన భావనకు వచ్చిన తర్వాతే తాను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
**కుటుంబ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా కొత్త నాయకత్వం..**
ఈ కొత్త ప్రజా ఉద్యమాన్ని తన రాజకీయ జీవితంలో తదుపరి దశగా అభివర్ణించిన అన్నామలై.. యువతతో పాటు సామాన్య ప్రజానీకం పెద్ద ఎత్తున ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజకీయాలు కేవలం కొద్దిమంది బడాబాబులు, ప్రభావవంతుల గుప్పెట్లోనే ఉండిపోకూడదని, సామాన్యులకు సైతం నాయకత్వంలో సమాన అవకాశాలు దక్కాలని ఆయన ఆకాంక్షించారు. తమిళనాట దశాబ్దాలుగా పాతుకుపోయిన వ్యక్తి ఆరాధన, కుటుంబ రాజకీయాలకు చరమగీతం పాడి, దానికి ప్రత్యామ్నాయంగా కచ్చితమైన సిద్ధాంతపరమైన ప్రజా రాజకీయాలను నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని ఉద్ఘాటించారు. కేవలం ప్రజా సమస్యలు, వారి ఆశయాలే కేంద్రంగా పనిచేసే నూతన విధానాన్ని తీసుకురావడమే తమ ప్రథమ లక్ష్యమని ఆయన తేల్చిచెప్పారు.
**లోక్‌సభ బరిలో పోటీకి సై..**
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమ వేదిక ప్రత్యక్ష రాజకీయ బరిలో నిలుస్తుందని అన్నామలై సంచలన ప్రకటన చేశారు. విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, యువతలో నాయకత్వ లక్షణాల పెంపు వంటి సామాజిక రంగాల్లో స్వచ్ఛంద సేవ చేసేందుకు ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరినీ ఈ నూతన వేదిక సాదరంగా ఆహ్వానిస్తోంది. స్థానిక స్థాయిలోని చిన్నచిన్న ప్రజా సమస్యల పరిష్కారంతో మొదలుపెట్టి, రాష్ట్రవ్యాప్తంగా ఒక గొప్ప రాజకీయ మార్పు తీసుకురావాలన్న బృహత్తర లక్ష్యంతో ఈ ఉద్యమం ముందుకెళ్తోంది. ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో సరికొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దేందుకు పుట్టుకొచ్చిన ఈ కొత్త ఉద్యమం.. రానున్న రోజుల్లో తమిళనాట ఎలాంటి పెను సంచలనం సృష్టించనుందో అన్న ఆసక్తికర చర్చ రాజకీయ వర్గాల్లో అప్పుడే మొదలైంది.