Mahaa Daily Exclusive

  రైతుల భూములను లాక్కోవడం కాంగ్రెస్‌ మార్కు నిరంకుశత్వం…

Share

రైతుల భూములను లాక్కోవడం కాంగ్రెస్‌ మార్కు నిరంకుశత్వం.
* నష్టపరిహారం ఇవ్వకుండా కోహెడ మార్కెట్‌ పనులు ఎలా చేపడతారు?
*కేంద్ర నిధులపై సచివాలయం గేటు వద్దైనా బహిరంగ చర్చకు సిద్ధం.
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శైలిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నిప్పులు.
హైదరాబాద్, మహా.
కోహెడలో నష్టపరిహారం చెల్లించకుండా రైతుల భూములను బలవంతంగా లాక్కోవడం కాంగ్రెస్‌ ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోహెడలోని సర్వే నంబర్‌ 167/1 పరిధిలో ఉన్న 239 ఎకరాల భూమి రైతుల సొంతమని స్పష్టం చేశారు. బాధితులకు ఒక్క రూపాయి కూడా సరైన పరిహారం ఇవ్వకుండా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అక్కడ ఫ్రూట్‌ మార్కెట్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం అప్రజాస్వామికమన్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఫ్రూట్‌ మార్కెట్‌ అందుబాటులో ఉన్నప్పటికీ, పక్కనే ఉన్న రైతుల భూములను సేకరించి ఇతర ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూడటం దుర్మార్గమని మండిపడ్డారు. భూముల సేకరణను రైతులు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆక్షేపించారు.
ముఖ్యమంత్రి పర్యటనకు ముందే నిరసన తెలుపుతారనే భయంతో స్థానిక రైతులను, బీజేపీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి, రోజంతా స్టేషన్లలో నిర్బంధించడాన్ని రాంచందర్ రావు తీవ్రంగా ఖండించారు. హక్కుల కోసం ప్రశ్నించే వారిని అణచివేయాలని చూడటం నిరంకుశ, రజాకార్ల పాలనను తలపిస్తోందని విమర్శించారు. మజ్లిస్ పార్టీతో సహవాసం చేయడం వల్లే కాంగ్రెస్‌కు నిజాం తరహా భాష, ధోరణి అలవాటయ్యాయని ఎద్దేవా చేశారు. రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతే అక్కడ పనులు చేపట్టాలని, అప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు సాగనిచ్చేది లేదని భారాస, కాంగ్రెస్ ఉమ్మడి వైఖరిపై పోరాడుతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం భూముల అమ్మకాలపైనే ఆధారపడుతూ, హైదరాబాద్‌ చుట్టుపక్కల రైతుల జీవనాధారాన్ని దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల మహబూబ్‌నగర్‌ సభలో కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ కుమార్‌లపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన “పొలిమేర దాటనివ్వను” అనే వ్యాఖ్యలపై రాంచందర్ రావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇలాంటి అహంకారపూరిత భాష ముఖ్యమంత్రి స్థాయికి తగదని హితవు పలికారు. తెలంగాణ సాధనలో, జేఏసీ ఉద్యమాల్లో బీజేపీ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. తమ పార్టీ శ్రేణులు తలుచుకుంటే కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చిందని పదేపదే ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రికి ఆయన కౌంటర్ ఇచ్చారు. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం సుమారు రూ.13 లక్షల కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాలను అనుసంధానిస్తూ రూ.8 వేల కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి, బీబీనగర్‌ ఎయిమ్స్‌, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌, ములుగు గిరిజన విశ్వవిద్యాలయం వంటివన్నీ కేంద్రం ఇచ్చినవేనని స్పష్టం చేశారు. పేదలకు అందుతున్న ఐదు కిలోల ఉచిత బియ్యం కూడా కేంద్రానిదేనని స్పష్టం చేశారు. కేంద్ర నిధులపై తాము శ్వేతపత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఏమిచ్చిందో చెప్పే ధైర్యం ఉంటే సచివాలయం గేటు వద్దైనా బహిరంగ చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల అవినీతి, కమిషన్ల పాలనను ప్రజలు గమనిస్తున్నారని, భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రస్తుత అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని రాంచందర్ రావు పేర్కొన్నారు.