Mahaa Daily Exclusive

  నిధులు తీసుకొస్తే.. కిషన్ రెడ్డికి ఎల్బీ స్టేడియంలో గండపెండేరం!

Share

నిధులు తీసుకొస్తే.. కిషన్ రెడ్డికి ఎల్బీ స్టేడియంలో గండపెండేరం!
*15వ తేదీ తర్వాత బరాబర్ ఆయన సంగతి తేలుస్తా.
*హైదరాబాద్ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న కేంద్రమంత్రి.
* రాజకీయాలకు అతీతంగా నగరాభివృద్ధి.
* ఉప్పల్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.

హైదరాబాద్, మహా.

నగర అభివృద్ధికి, మూసీ ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు, అనుమతులు తీసుకువస్తే కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎల్బీ స్టేడియంలో బహిరంగంగా గండపెండేరం తొడుగుతానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించకుండా, రాజకీయాలు చేస్తే మాత్రం ఈ నెల 15వ తేదీ తర్వాత ఆయన సంగతి ఏంటో బరాబర్ తేలుస్తానని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఉప్పల్ భగాయత్ లో నూతనంగా నిర్మించిన వంజరి కుల ఆత్మగౌరవ భవనాన్ని (ఖత్రి భవన్) ముఖ్యమంత్రి ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రతిపక్షాలపై, ముఖ్యంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అదే సమయంలో తన రాజకీయ ఎదుగుదలకు కారణమైన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల పట్ల తన కృతజ్ఞతా భావాన్ని చాటుకున్నారు.
**మల్కాజిగిరే నాకు రాజకీయ పునర్జన్మ నిచ్చింది..**
కొడంగల్ ఎన్నికల్లో ఓడిపోయి రాజకీయంగా కష్టకాలంలో ఉన్నప్పుడు, మల్కాజిగిరి పార్లమెంట్ ప్రజలు తనను అక్కున చేర్చుకున్నారని ముఖ్యమంత్రి భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. మినీ భారతదేశంగా పిలిచే మల్కాజిగిరి ప్రజలు ఒక్క పైసా ఆశించకుండా తనను ఎంపీగా గెలిపించారని, ఆ విజయమే తనను పీసీసీ అధ్యక్షుడిగా, తదనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి చేర్చిందని ఆయన స్పష్టం చేశారు. మహిళల ఆశీస్సులతోనే తాను జడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని, అందుకే తన ప్రతి సభలో ఆడబిడ్డలకు ముందు వరుసలో కూర్చునే అవకాశం కల్పిస్తానని తెలిపారు. గత ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్లే ఎంపీగా ఆశించిన స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోయానని, ఇప్పుడు కాలం గిర్రున తిరిగి ముఖ్యమంత్రినయ్యానని, ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత పూర్తిగా తనదేనని ఆయన భరోసా ఇచ్చారు.
**రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పరుగులు..**
ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు మాట్లాడదామని, అభివృద్ధి విషయంలో అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి చెందినవారైనప్పటికీ, ఉప్పల్ ప్రాంతానికి 40 ఏళ్ల పాటు విశేష సేవలందించిన ఆయన సోదరుడు బండారు రాజిరెడ్డి పేరును ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కు పెట్టి తమ చిత్తశుద్ధిని చాటుకున్నామని గుర్తుచేశారు. ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నా వారి నియోజకవర్గాల అభివృద్ధికి తాను సహకరిస్తానని, రోడ్లు, చెరువుల సుందరీకరణ, మెట్రో విస్తరణ వంటి పనులకు నిధుల కొరత లేకుండా చూస్తానని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఉప్పల్ ప్రాంతంలో ఏకంగా రూ.1600 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. పరిపాలనా వికేంద్రీకరణ, సౌలభ్యం కోసమే మూడు కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేశామని, ఇది ఎన్నికల కోసం లేదా రాజకీయ స్వార్థం కోసం తీసుకున్న నిర్ణయం కాదని ఆయన వివరించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ ద్వారా హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.
**కిషన్ రెడ్డి అడుగడుగునా అడ్డుపడుతున్నారు..**
మూసీ నది ప్రక్షాళన, మెట్రో విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ లో సబర్మతి, యూపీలో గంగా, ఢిల్లీలో యమునా నదులను అభివృద్ధి చేసుకున్నప్పుడు, హైదరాబాద్ లో మూసీని ఎందుకు ప్రక్షాళన చేయకూడదని ఆయన సూటిగా ప్రశ్నించారు. మూసీ మురికి వల్ల ఇక్కడి భూముల ధరలు పెరగడం లేదని, కాలుష్యం వల్ల నల్గొండ జిల్లా ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చి, వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తామంటే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మేర మూసీని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి, పర్యాటక ప్రాంతంగా మార్చి యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతామన్నారు. నాగోల్ నుంచి గౌరెల్లి వరకు ఫేజ్-2 మూసీ ప్రక్షాళన పనులను వంద రోజుల్లో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
**కేంద్రం నుంచి నిధులు తేవాల్సిన బాధ్యత లేదా?**
హైదరాబాద్ ప్రజల ఓట్లతో గెలిచిన కిషన్ రెడ్డి.. నగరానికి మెట్రో అనుమతులు, మూసీకి నిధులు తీసుకురావాల్సిన బాధ్యతను విస్మరించారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని, మిగిలిన 25 లక్షల టన్నులను కేంద్రంతో కొనిపించే బాధ్యత ఆయనకు లేదా అని నిలదీశారు. రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) తీసుకువస్తే ప్రపంచంతో పోటీ పడే అవకాశం ఉంటుందని, దీనికోసం తాను రెండున్నరేళ్లలో ఏకంగా యాభై సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిశానని గుర్తుచేశారు. కానీ కిషన్ రెడ్డి మాత్రం కనీసం తనను కేంద్ర మంత్రుల వద్దకు కూడా తీసుకువెళ్లడం లేదని విమర్శించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణంపై చర్చలు జరగకుండా అడ్డుపడుతున్నది కూడా కిషన్ రెడ్డేనని ఆరోపించారు. కేంద్రంతో మాట్లాడి ప్రాజెక్టులకు అనుమతులు తీసుకువస్తే ఎల్బీ స్టేడియంలో కిషన్ రెడ్డికి గండపెండేరంతో సత్కరిస్తానని, లేకపోతే ఆయన చీకటి రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెబుతారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.