నవ శకానికి నాంది.
* రాజకీయాలకు అతీతంగా మహానగర సమగ్రాభివృద్ధి.
*రూ. 1,674 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
హైదరాబాద్, మహా.
రాష్ట్ర అభివృద్ధే ఏకైక ఎజెండాగా, వచ్చే రెండున్నరేళ్లు నిరంతరం తెలంగాణ వికాసం కోసం అహర్నిశలు శ్రమిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. రాజకీయాలకు అతీతంగా, ఎలాంటి వివక్షకు తావులేకుండా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే పూర్తి బాధ్యతను తాను స్వయంగా తీసుకుంటానని స్పష్టం చేశారు. దేశంలోని ఇతర మహానగరాలు ఎదుర్కొంటున్న కాలుష్యం, ట్రాఫిక్, వరదల వంటి తీవ్రమైన సమస్యలను ముందుగానే పసిగట్టి, శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరాన్ని పక్కా ప్రణాళికతో, భవిష్యత్ దార్శనికతతో (విజన్) తీర్చిదిద్దుతామని ఆయన ప్రకటించారు. మియాపూర్ క్రాస్ రోడ్స్ వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయ నూతన భవన నిర్మాణంతో పాటు, మొత్తం రూ. 1,674.74 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు కీలక అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నగర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వ కార్యాచరణను సవివరంగా ప్రజల ముందుంచారు. కేవలం హైదరాబాద్‌ను ‘విశ్వనగరం’ అని మాటల్లో చెబితే సరిపోదని, ఆ స్థాయికి తగ్గట్లుగా క్షేత్రస్థాయిలో అద్భుతమైన ప్రణాళికలు అమలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగానే మల్కాజిగిరి పరిధిలోని గాజుల రామారంలో ఏకంగా వంద ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్‌ను నిర్మించనున్నట్లు ఒక కీలక ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన పనులను రానున్న మూడు నెలల్లోనే యుద్ధప్రాతిపదికన ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అలాగే నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చేలా రాయదుర్గం నుంచి నియోపోలీస్ వరకు మెట్రో రైలు మార్గాన్ని విస్తరించే పనులను సైతం త్వరలోనే చేపడతామని వెల్లడించారు. వీటికి తోడు మూసీ నది సమగ్ర ప్రక్షాళన, తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్), రేడియల్ రోడ్ల నిర్మాణం వంటి బృహత్తర ప్రాజెక్టులను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు అత్యంత ఆధునిక సదుపాయాలతో కూడిన అద్భుతమైన పరిపాలనా భవనాలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు.
హైదరాబాద్ నగరపాలక వ్యవస్థలో ఒక చారిత్రక ఘట్టంగా నిలిచే పరిపాలనా వికేంద్రీకరణ వెనుక ఉన్న ఆంతర్యాన్ని ముఖ్యమంత్రి సోదాహరణంగా వివరించారు. ప్రస్తుతం అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపలి ప్రాంతంలోనే ఏకంగా 1.34 కోట్ల జనాభా నివసిస్తున్నారని, దేశ విదేశాల నుంచి ఉపాధి కోసం లక్షలాది మంది నిత్యం నగరానికి వస్తుండటంతో ఏటా 3 శాతం వృద్ధి చెందుతోందని ఆయన గుర్తుచేశారు. ఇంతటి భారీ జనాభా ఉన్న ఈ విశాల ప్రాంతంలో ఇన్నాళ్లూ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రేటర్ హైదరాబాద్ అని నాలుగు రకాల పాలనా వ్యవస్థలు ఉండటం వల్ల తీవ్ర గందరగోళం నెలకొనేదన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య కనీస సమన్వయం లోపించి రోడ్లు, తాగునీరు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, చెత్త నిర్మూలన లాంటి కనీస అవసరాలు కూడా తీరక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దయనీయ పరిస్థితిని శాశ్వతంగా చక్కదిద్దేందుకే నిపుణులతో సుదీర్ఘంగా సమాలోచనలు జరిపామన్నారు. అందులో భాగంగానే 2,100 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న మహానగరాన్ని మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లుగా అనగా 150 డివిజన్లతో జీహెచ్ఎంసీ, 76 డివిజన్లతో సైబరాబాద్, 74 డివిజన్లతో మల్కాజిగిరి కార్పొరేషన్లుగా విడదీసినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. పాలనా సౌలభ్యం కోసమే ఈ వికేంద్రీకరణ జరిగిందని, దీనికి అనుగుణంగానే పోలీస్ కమిషనరేట్ల పరిధులను సైతం హేతుబద్ధీకరించి ఏర్పాటు చేశామని వివరించారు. దేశంలోని ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై నగరాలు ఎదుర్కొంటున్న దుస్థితి నుంచి గుణపాఠాలు నేర్చుకుని ముందుచూపుతో ప్రణాళికలు రచిస్తున్నామన్నారు.
హైదరాబాద్‌లో సొంతింటి కల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పేద, మధ్యతరగతి వర్గాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపికబురు అందించారు. నగరవ్యాప్తంగా నిరుపేదలు ఎక్కడెక్కడైతే నివాసం ఉంటున్నారో, వారందరికీ వీలైనంత వరకు అదే ప్రాంతంలో ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఇందుకోసం ఏకంగా లక్ష ఎల్ఐజీ , ఎంఐజీ ఇళ్లను నిర్మించి అర్హులకు పంపిణీ చేయబోతున్నామని, ఇళ్ల నిర్మాణానికి అనువైన ప్రభుత్వ భూములను ఇప్పటికే ముమ్మరంగా గుర్తిస్తున్నామని స్పష్టం చేశారు. అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి రాజకీయ వివక్షగానీ, వితండవాదంగానీ లేదని ఆయన తేల్చిచెప్పారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు ఉండాలని, మరో ఆరు నెలల్లో ఎన్నికలు అనగా అప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకుందామని ఆయన సూచించారు. అప్పటివరకు ప్రతిపక్షాలతో సహా అన్ని రాజకీయ పక్షాలు తమ విజ్ఞతను ప్రదర్శించి రాష్ట్ర, నగర అభివృద్ధికి సంపూర్ణంగా సహకరించాలని ముఖ్యమంత్రి బహిరంగంగా పిలుపునిచ్చారు.
మియాపూర్ క్రాస్ రోడ్స్ వద్ద అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ బృహత్తర కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు, స్థానిక శాసనసభ్యులు అరికెపూడి గాంధీ, మల్రెడ్డి రంగారెడ్డి, సీనియర్ నాయకులు నవీన్ యాదవ్ తదితరులతో పాటు భారీ సంఖ్యలో ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ఈ సభకు హాజరయ్యారు.








