Mahaa Daily Exclusive

  వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదం……

Share

  • వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదం
  • విచారణకు హైలెవల్‌ కమిటీ
  • మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా
  • కార్మికులకు అండగా ఉఁటామన్న కేంద్ర మంత్రి
  • ప్రమాద ప్రాంతాన్ని సందర్శించిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి

విశాఖపట్టణం, మహా : విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. సోమవారం జరిగిన ఈ దురదృష్టకర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున భారీ ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రకటించారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యోగుల కుటుంబాలకు సైతం రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన వెల్లడించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఎస్‌ఎమ్‌ఎస్-2, ఎస్‌టీసీ-3 హీట్ ఫెసిలిటీ విభాగాల నుంచి సోమవారం ఒక్కసారిగా భారీ ఎత్తున ద్రవరూప ఉక్కు (మోల్టెన్ స్టీల్) లీక్ కావడంతో ఈ దారుణమైన ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో కనీసం ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమవ్వగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.

అండగా ఉంటాం : కేంద్ర మంత్రి కుమారస్వామి

ఈ తీవ్ర విషాదంపై కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. “ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మానసిక ధైర్యాన్ని ప్రసాదించాలని నా అంతరాత్మతో ప్రార్థిస్తున్నాను. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులెవరూ అధైర్యపడొద్దు, భయాందోళనలకు గురికావద్దు. కేంద్ర ప్రభుత్వం మీకు పూర్తి అండగా ఉంటుంది” అని ఆయన భరోసా ఇచ్చారు. ఆర్థిక పరిహారంతో పాటు బాధితుల కుటుంబాలకు కేంద్ర మంత్రి పలు కీలక హామీలను ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలు, సదరు ఉద్యోగి అసలు రిటైర్మెంట్ వయస్సు వచ్చేంతవరకు ప్రస్తుతం నివసిస్తున్న ప్లాంట్ క్వార్టర్స్‌లోనే నివాసం ఉండేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా మరణించిన కార్మికుల పిల్లల చదువుల బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని, మిగిలిన ఉద్యోగుల పిల్లలతో సమానంగా వీరికి కూడా విద్యా సంబంధిత ఆర్థిక సాయాన్ని పూర్తిగా అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ ఉక్కు ప్లాంట్ ప్రమాద బాధితులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు . ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి బాధితులకు తక్షణ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన ప్రతి కార్మికుని కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున అదనపు ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అధికారికంగా వెల్లడించింది.

చంద్రబాబు సమీక్ష

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, ప్రభుత్వ ఉన్నతాధికారులు, విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ఈ సమీక్షా సమావేశంలో విశాఖ జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి ప్రమాదం జరిగిన తీరును, అక్కడ తీసుకుంటున్న సహాయక చర్యలను నివేదించారు. గాయపడిన కార్మికులకు అందిస్తున్న అత్యవసర వైద్య చికిత్సను, ప్లాంట్ వద్ద ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎనిమిది మంది మరణించారని, గాయపడిన ఆరుగురిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని కలెక్టర్ ముఖ్యమంత్రికి నివేదించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

విచారణ వేగవంతం – హైలెవల్ కమిటీ ఏర్పాటు

స్టీల్ ప్లాంట్ లో సంభవించిన ఘోర ప్రమాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణను వేగవంతం చేశాయి. ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేయడానికి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన రక్షణ చర్యలను సిఫార్సు చేయడానికి ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు. ఈ కమిటీ మంగళవారం ఉదయం నుంచే క్షేత్రస్థాయిలో తన పరిశోధనలను ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు. ఉదయం ప్రమాదం జరిగిన ప్లాంట్ పరిసరాలను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ స్వయంగా సందర్శించి, క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాద తీవ్రత బాధితులకు అందే ఆర్థిక సహాయంపై కీలక వివరాలను వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మరణించగా, ఆరుగురు గాయపడ్డారని ఆయన అధికారికంగా ధృవీకరించారు. గాయపడిన వారిలో ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు.