Mahaa Daily Exclusive

  హిట్లర్… హీట్…

Share

హిట్లర్… హీట్…

హిట్లర్… హిట్లర్… హిట్లర్… ఇప్పుడు ఈ పేరు హిట్ అయింది… అంతే కాదు… హాట్ టాపిక్ కూడా అయింది… కాస్త చరిత్ర తెలిసిన వాళ్ళు అయితే హిట్లర్ పేరు ఇప్పుడు మళ్ళీ ఎందుకు ప్రచారంలోకి వచ్చిందని ఆలోచిస్తుంటే ఆయన గురించి తెలియని ఆధునిక యువత మాత్రం ఇది ఆ మధ్య కాలంలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సినిమా పేరు అనుకుంటున్నారు… అప్పుడెప్పుడో వచ్చిన హిట్లర్ సినిమా గురించి ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నారు అని అనుమానం వ్యక్తం చేసే నవ యువత కూడా లేకపోలేదు… అసలు సీఎం రేవంత్ హిట్లర్ పేరు ఎందుకు వాడారు… అది అయోచితంగా నోటి నుంచి వచ్చేసిందా? లేకపోతే హిట్లర్ పోకడ రేవంత్ ను మెప్పించిందా? అని సందేహ పడే వారు లేకపోలేదు. ఏదిఏమైనా సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ పేరు ప్రస్తావనకు తెచ్చి తెలంగాణలో ఓ రాజకీయ హిట్ పుట్టించారు… ఇదే ఇప్పుడు తెలంగాణ పార్టీలకు ఓ ఆయుధం అయింది… అదిగో రేవంత్ రెడ్డి హిట్లర్ పోకడలు పోతున్నారు… అది ఆయనే స్వయంగా చెప్పేసారు… ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు… హట్లర్ పాలన… అంటూ విపక్షాలు విరుచుకు పడుతున్నాయి… అసలు ఏ సమయంలో ఏ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి నియంత అయిన హిట్లర్ పేరు వాడారు? అనేది ఇప్పుడు పక్కన పెట్టేసారు… అదంతా అనవసరం… రేవంత్ రెడ్డి హిట్లర్ పేరు తీసారా లేదా… తీసారు… ఇంకేంటి… ఆయన హిట్లర్ పాలసీలు పాటిస్తున్నారు… హిట్లర్ లానే వ్యవహారిస్తున్నారు… ఇది ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధం.. ఇదే ఇప్పుడు విపక్షాల వాదన… అయ్యా… సీఎం గారు… అసలు ఏ అంశంలో హిట్లర్ పేరు తీశారో గమనించండి… ఆయన ఉద్దేశ్యం ఏమిటో అర్ధం చేసుకోండి… ఆయన వ్యాఖ్యలను పెడదారి పట్టించకండి… లేని అర్దాలు, అపోహలు ప్రజల నెత్తిన రుద్దకండీ… అంటూ తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతలు పదే పదే వివరణలు ఇస్తూనే వున్నారు… అయినా విపక్షాలు ససేమిరా అంటున్నాయి… నాలుగు రోజుల నుంచి ఇదే టాపిక్ మీద తెలంగాణ రాజకీయం సాగుతూనే వుంది… ప్రజలకు అసలు హిట్లర్ ఎవ్వరో… ఆయన ఏం చేశారో తెలియక పోయినా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం మొదలు పెట్టారు.

తెలంగాణలో హిట్లర్ పదం ఊత పదంగా మారిపోయింది. నేతల నోటి నుంచి మొదలు అయిన ఈ పేరు ఇప్పుడు సామాన్యులు కూడా వాడేస్తున్నారు. ఈ వివాదానికి మూలం హైడ్రా. తెలంగాణ భూబకాసురుల భరతం పట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా ఇప్పుడు భూకబ్జాదారుల పాలిట సింహస్వప్నం అయింది. హైదరాబాద్ లో కాస్త ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ఆక్రమించి క్యాష్ చేసుకునే వారి సంఖ్య లెక్కల్లో చెప్పలేం. చెరువులు, కుంటలు, పార్కులు, కొండలు, కాలువలు… ఇలా ఒకటేమిటి… ఎక్కడ స్థలం ఉంటే అక్కడ భూకబ్జాదారులు వాలి పోయారు. ఫలితంగా హైదరాబాద్ లో చినుకు పడితే ముంపు ముప్పేటదాడి చేస్తోంది. ఈ ముంపునకు అసలు కారణం గమనించిన సీఎం రేవంత్ హైడ్రా ఏర్పాటు చేశారు. దానికి విశేష అధికారాలు ఇచ్చారు. అంతే… భూబకాసురుల పై హైడ్రా ఉక్కు పాదం మోపటం మొదలు పెట్టింది. హైదరాబాద్ లో అక్రమ భూ ఆక్రమదారులను బుల్ డోజర్స్ తో తొక్కి వేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్, దాని చుట్టు పక్కన జరిగిన వేల ఎకరాల భూమిని కబ్జాల చెర నుంచి విముక్తి కలిగించింది. కాలువల ఆక్రమణల పై ప్రత్యేక దృష్టి పెట్టింది… చెరువులకు మళ్ళీ రూపు రేకలు తెచ్చింది.

పేద, మధ్య, ధనిక, ఉన్నత వర్గాల తేడా హైడ్రా చూడటం లేదన్నది ఆ సంస్థ పనితీరు చెప్పకనే చెబుతోంది. ఎంత వారైనా సరే లెక్క చేయటం లేదు. అది సర్కార్ ల్యాండ్ అని నిర్దారణ అయితే బుల్ డోజర్ తో అక్కడ హైడ్రా ప్రవేశం చేస్తోంది. ఇదే కొందరికి నచ్చలేదు. హైడ్రా అతిగా స్పందించి వ్యవహరిస్తోందని విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. చూసే వారికి కూడా ఇందులో కొంచెం నిజం ఉన్నట్టు కనిపించడం సహజమే. నిజానికి హైదరాబాద్ లో చినుకులు పడి ఓ మోస్తారు వర్షాలు పడితే పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోవటం చూస్తూనే వున్నాం. ప్రభుత్వ అలక్ష్యం వల్లే ఈ దుస్థితి అంటూ తిడుతూనే వున్నాం. కానీ అడ్డగోలు కట్టడాలు… కబ్జాల వల్లే ఈ దారుణమైన స్థితి వచ్చిందని మాత్రం అనుకోవటం లేదు. ఇలాంటి ఇబ్బందికి చెక్ పెట్టేందుకే హైడ్రా అంటారు పాలకులు. నిర్దాక్షిణ్యంగా హైడ్రా అడుగులు వేయటం పెద్ద వివాదంగానే మారింది.

హైడ్రా మంచి చేస్తోందో, అతిగా వ్యవహారిస్తోందో తేల్చి చెప్పేముందు ఇప్పుడు కబ్జా బారి నుంచి బయట పడిన చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు మాత్రం తిరిగి కనిపించడం మాట వాస్తవం. దీన్ని ఎవ్వరు కాదన్న లేరు. అయితే హైడ్రా పేద, మధ్య వర్గ ప్రజల పట్ల కూడా కఠినంగా వ్యవహరించిన తీరే కొంత ఆవేదన, ఆందోళన కలిగించే అంశం. దీనిపై విపక్షాలు గట్టిగానే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. వీటికి సమాధానంగా సీఎం రేవంత్ హైడ్రా పనితీరును హిట్లర్ తో పోల్చారు. అంతే… విపక్షాలకు ఓ పెద్ద అవకాశం చిక్కింది. రేవంత్ రెడ్డి హైడ్రాను వెనుక వేసుకొని రావటం, హిట్లర్ తో హైడ్రాను పోల్చటం పై ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. రేవంత్ హిట్లర్ సిద్దాంతాలు నమ్ముతూ అవే ఇప్పుడు పాటిస్తున్నారని ప్రతి పక్షాలు గగ్గోలు పెట్టేస్తున్నాయి. సీఎం ఉద్దేశ్యం అది కాదని పట్టిన పట్టు వదలకుండా, వెనక అడుగు వేయకుండా హిట్లర్ ఎలా విజయం సాధించారో హైడ్రా అలా దూసుకు పోతోందనే ఆయన చెప్పారని, దీన్ని వక్రీకరించి ప్రచారం చేయటం సరికాదని కాంగ్రెస్ నేతలు, మంత్రులు సుధీర్గ వివరణలే ఇస్తున్నారు.

హిట్లర్ పేరు ఇప్పుడు తెలంగాణలో మారుమోగుతోంది. చరిత్ర తెలియని నేటి యువత కూడా ఇప్పుడు హిట్లర్ గురించి తెలుసు కునే పనిలో పడ్డారు. కాక పోతే రాజకీయ నేతల విమర్శలు ఇప్పుడు ముదురి పోతున్నాయి. నేల విడిచి సాము పద్ధతిలో ఏ రాజకీయ పార్టీ నేత ఎందుకు ఎవరిని ఏ పాయింట్ మీద విమర్శలు చేస్తున్నాడో అర్ధం కానీ పరిస్థితి వచ్చి పడింది. రాష్ట్రంలో ఇంక ఏ సమస్య లేనట్టు ఇప్పుడు హిట్లర్ రాజకీయాలు తెలంగాణలో పెరిగి పోవటం ప్రజలకు చిరాకు తెప్పిస్తోంది. హైడ్రా ఇప్పుడు మీడియాలో ఓ పెద్ద ప్లేస్ ఆక్రమించింది.హైదరాబాద్, దాని చుట్టు పక్కన ప్రాంతాల్లో దురాక్రమణలను మాత్రమే కూల్చి, ప్రభుత్వ స్థలాలు పరిరక్షణకు ఏర్పాటు అయిన హైడ్రా ఇలా రాజకీయ ప్రకంపనలకు కేంద్ర బిందువు అవుతుందని ఎవ్వరు ఊహించి వుండరు. ఇక హిట్లర్ పేరు కూడా ఒక్కసారిగా అందరి నోట మాట అవుతుందని కూడా అనుకోని వుండరు. మొత్తానికి ఇప్పుడు తెలంగాణలో హిట్లర్ హీట్ లో రాజకీయాలు రంజుగానే సాగి పోతున్నాయి. అవకాశం వస్తే దేన్నీ రాజకీయ పార్టీలు వదులుకోవు అనే నిజం మరోసారి రుజువు అయింది.

జీ. వెంకటరమణ

సీనియర్ జర్నలిస్టు