పొత్తులు ఏపీ వరకే.
* తెలంగాణలో ఒంటరి పోరు.
* తేల్చేసిన అమిత్ షా.
* జనసేనకు నిరాశ.. టీడీపీలో కొత్త ఉత్సాహం.
* జీహెచ్ఎంసీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే కమలం బరిలోకి.
* తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మారనున్న సమీకరణాలు.
ఢిల్లీ, మహా.
తెలుగు రాష్ట్రాల్లో పొత్తుల వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా కీలక ప్రకటన చేశారు. తెలుగుదేశం, జనసేన పార్టీలతో బీజేపీకి ఉన్న పొత్తు కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టడం ద్వారా రాబోయే రోజుల్లో కమలదళం వ్యూహం ఎలా ఉండబోతోందనే దానిపై ఆయన పూర్తి స్పష్టత ఇచ్చారు.
#జనసేనకు షాక్.. వచ్చే ఎన్నికల్లోనూ ఒంటరిగానే..
అమిత్ షా చేసిన ఈ తాజా ప్రకటన పొరుగు రాష్ట్రంలో బీజేపీతో కలిసి సాగుతున్న జనసేనకు తెలంగాణలో ఒకింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమిగా ఏర్పడి 2024 ఎన్నికల్లో అఖండ విజయం సాధించినప్పటికీ, ఆ సమీకరణాలను తెలంగాణకు వర్తింపజేయలేమని కేంద్ర పెద్దలు తేల్చిచెప్పారు. తెలంగాణలో కమలం అండతో చక్రం తిప్పాలని భావించిన జనసేనాని పవన్ కల్యాణ్ ఆశలకు ఈ నిర్ణయం నిరాశే మిగిల్చింది. భవిష్యత్తులో జరగబోయే ప్రతిష్టాత్మక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని అమిత్ షా స్పష్టం చేయడంతో అక్కడ త్రిముఖ లేదా చతుర్ముఖ పోరు తప్పనిసరి కానుంది.
#టీడీపీకి అందివచ్చిన అవకాశం
మరోవైపు, తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరు నిర్ణయం పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పొత్తులు లేకుండా సొంతంగా బలం పుంజుకోవాలని చూస్తున్న ఆ పార్టీకి ఇది ఒక మంచి అవకాశంగా మారనుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం బలమైన నాయకత్వ కొరత ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం, ఓటు బ్యాంకు ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ అన్ని ప్రధాన పార్టీలు టీడీపీ క్యాడర్ మద్దతు కోసం ప్రయత్నించడం ఇందుకు నిదర్శనం.
#మారనున్న క్షేత్రస్థాయి సమీకరణాలు
గత 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు టీడీపీ ఓటర్లను ఆకర్షించడానికి పోటీ పడ్డాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీలలో సైతం పసుపు జెండాలు కనిపించాయంటే క్షేత్రస్థాయిలో ఆ పార్టీ ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటు బ్యాంకు మెకానిజం చాలా వరకు రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేసి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పరోక్షంగా దోహదపడింది. ఇప్పుడు తెలంగాణలో ఒంటరిగా బరిలోకి దిగడం ద్వారా తమ సొంత క్యాడర్‌ను తిరిగి ఏకం చేసుకుని, పూర్వవైభవాన్ని సాధించవచ్చని టీడీపీ భావిస్తోంది. కాగా, తెలంగాణ రాజకీయాల్లో జనసేన ముద్ర ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో కనిపించకపోవడంతో, ఒంటరి పోరు ఆ పార్టీకి అంత సులువు కాదని, క్షేత్రస్థాయిలో తీవ్ర సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.







