క్యాన్సర్ మందుల కొరతకు చెక్..
* కీలక ఔషధాల ధరల పెంపునకు కేంద్రం ఆమోదం. ఢిల్లీ,మహా.
దేశవ్యాప్తంగా క్యాన్సర్ రోగులకు ప్రాణాధారమైన కీలక కీమోథెరపీ మందుల కొరతకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో డిమాండ్‌కు తగ్గట్లుగా ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు వీలుగా సిస్ప్లాటిన్, కార్బోప్లాటిన్ వంటి అత్యవసర కీమోథెరపీ ఔషధాల ధరలను పెంచేందుకు అధికారికంగా ఆమోదముద్ర వేసింది. ముడి పదార్థాల (ఏపీఐ) ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఉత్పత్తి దారులు ఈ మందుల తయారీని నిలిపివేశారు. ఈ నేపథ్యంలోనే మందుల లభ్యతను పెంచే లక్ష్యంతో ‘ధరల నియంత్రణ చట్టం (డీపీసీఓ)-2013’లోని పేరా 19ని ఉపయోగించి ధరల పెంపునకు రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి సూత్రప్రాయ ఆమోదం తెలిపారు. ఇది అత్యవసర సమయాల్లో మందుల అందుబాటును నిర్ధారించడానికి మాత్రమే ప్రభుత్వం ఉపయోగించే అసాధారణ అధికారం కావడం గమనార్హం.
**తయారీదారుల విజ్ఞప్తులపై సానుకూల స్పందన**
ఔషధాల తయారీకి వాడే ముడి పదార్థాల వ్యయం భారీగా పెరగడం, ఉత్పత్తి ఖర్చులు తడిసిమోపెడవడంతో పాటు విదేశీ మారకద్రవ్య విలువల్లో హెచ్చుతగ్గుల కారణంగా పాత ధరలకే మందులను విక్రయించడం ఆర్థికంగా సాధ్యం కావడం లేదని పలు ఫార్మా కంపెనీలు నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ)కి దరఖాస్తు చేసుకున్నాయి. దాదాపు 82 ఫార్ములేషన్ల ధరలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయి. దీనిపై ఏర్పాటైన అంతర్-మంత్రివర్గ కమిటీ (ఐఎంసీ) లోతుగా అధ్యయనం చేసి, కేవలం నాలుగు మందులను మాత్రమే అత్యవసరమైనవిగా గుర్తించింది. అందులో క్యాన్సర్ చికిత్సలో ఫస్ట్-లైన్ మందులుగా వాడే సిస్ప్లాటిన్, కార్బోప్లాటిన్ ఇంజెక్షన్లతో పాటు, రెండు యాంటీ-టెటానస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు ఉన్నాయి. ప్రజా ఆరోగ్య దృష్ట్యా వీటి లభ్యత నిరంతరాయంగా ఉండాలన్న ఉద్దేశంతో ఐఎంసీ ఈ మేరకు ధరల సవరణకు సిఫార్సు చేసింది.
**టాటా మెమోరియల్ ఆందోళనతో కదలిక**
వివిధ రకాల క్యాన్సర్ల చికిత్సలో విస్తృతంగా ఉపయోగించే ఈ రెండు కీమోథెరపీ మందుల కొరతపై దేశంలోనే ప్రసిద్ధి చెందిన టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పెంపునకు పచ్చజెండా ఊపింది. అయితే, ముడి పదార్థాల వ్యయం ఎంత పెరిగిందన్న ప్రాతిపదికన మాత్రమే ఈ ధరల పెంపు ఉండాలని స్పష్టం చేసింది. గత నిర్ధారిత ధర నుంచి ఏడాదికి 10 శాతం పెంపు చొప్పున, గరిష్టంగా 50 శాతం వరకు మాత్రమే పెంచేలా చూడాలని ఎన్‌పీపీఏకి ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
**ఆర్థిక భారమైనా.. ప్రాణాలు దక్కేలా!**
కీలకమైన కీమోథెరపీ మందుల కొరత కారణంగా దేశవ్యాప్తంగా అగ్రశ్రేణి ఆంకాలజిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చికిత్సలో జాప్యం జరగడం, మందుల డోసేజీలు తగ్గించాల్సి రావడం, ప్రత్యామ్నాయ మందుల వైపు మొగ్గుచూపాల్సి రావడం వల్ల రోగులకు అటు ఆర్థికంగా, ఇటు ఆరోగ్యపరంగా నష్టం వాటిల్లుతోంది. ప్రత్యామ్నాయ విధానాలు తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉండటమే కాకుండా ఖర్చుతో కూడుకున్నవి. నష్టాలకు మందులు అమ్మలేక కంపెనీలు ఉత్పత్తి ఆపేయడం వల్లే ఈ కొరత ఏర్పడిందని గ్రహించిన ప్రభుత్వం.. తాజా నిర్ణయంతో ఉత్పత్తిదారులకు ఊరటనిచ్చింది. ధరల పెంపు వల్ల క్యాన్సర్ రోగుల కుటుంబాలపై కొంత ఆర్థిక భారం పడినప్పటికీ.. మార్కెట్లో మందుల కొరత తీరి, అత్యవసర సమయంలో చికిత్స అందుబాటులోకి వచ్చి ప్రాణాలు నిలబడతాయన్నది ప్రభుత్వ వర్గాల వాదన.







