Mahaa Daily Exclusive

  హోం మేకర్ కాదు దేశ నిర్మాత…

Share

  • హోం మేకర్ కాదు దేశ నిర్మాత
  • గృహిణులు దేశ నిర్మాతలు
  • పరిహారం కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
  • గృహిణుల ప్రాధాన్యతను నొక్కి చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం

న్యూఢిల్లీ, మహా : ఇళ్లల్లో మహిళలు చేసే శ్రమకు వెలకట్టలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒక గృహిణి కేసు విచారణ సందర్భంగా.. ఆమె సేవలను నెలకు కనీసం రూ.30,000 ఆదాయంతో సమానంగా పరిగణించాలని అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. గృహిణులు కేవలం కుటుంబాలనే కాదు, దేశాన్ని నిర్మిస్తారని కొనియాడింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒక మహిళకు సంబంధించిన పరిహారం కేసును విచారిస్తూ, గృహిణి అందించే గృహ సంరక్షణ సేవలను నెలకు కనీసం రూ. 30,000 ఆదాయంగా లెక్కించాలని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్‌కే సింగ్‌లతో కూడిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.

అసలు కేసేంటి?

ఈ వివాదానికి సంబంధించిన నేపథ్యం పంజాబ్‌ రాష్ట్రంలో జరిగింది. 2001 నవంబర్ 25న జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె భర్త, ముగ్గురు పిల్లలు పరిహారం కోసం ‘మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్’ను ఆశ్రయించారు. అప్పట్లో ఆ ట్రిబ్యునల్ వారికి రూ. 2.42 లక్షల పరిహారాన్ని మంజూరు చేసింది. అయితే ఈ పరిహారంతో సంతృప్తి చెందని బాధితులు హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఆ మొత్తాన్ని 7.5 శాతం వడ్డీతో కలిపి రూ. 8.43 లక్షలకు పెంచింది. అయినప్పటికీ తగిన న్యాయం జరగలేదని భావించిన కుటుంబ సభ్యులు చివరకు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ అప్పీలును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, బాధితులకు అదనపు పరిహారం మంజూరు చేస్తూ గృహిణుల ప్రాధాన్యతను నొక్కి చెప్పింది. మోటారు వాహనాల ప్రమాద కేసుల్లో గృహిణిని కోల్పోవడాన్ని ఒక ప్రత్యేకమైన, పరిహారం చెల్లించదగిన నష్టంగా పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది.

“కుటుంబ పోషణ కోసం ప్రత్యక్షంగా సంపాదించే వ్యక్తి ఎంత ముఖ్యమో, ఇంట్లో ఉంటూ సేవలు అందించే గృహిణి పాత్ర కూడా అంతే ముఖ్యం” అని బార్ అండ్ బెంచ్ నివేదిక ప్రకారం కోర్టు వ్యాఖ్యానించింది. “గృహిణి ఒక మనిషి ఎదుగుదలకు, తద్వారా దేశ పురోభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. గృహిణులే నిజమైన దేశ నిర్మాతలు” అని సుప్రీంకోర్టు కొనియాడింది. “మేం కొన్ని ప్రాథమిక సూత్రాలను రూపొందించాం. గృహిణి అందించే గృహ సంరక్షణ నష్టాన్ని ఏ పరిస్థితిలోనైనా నెలకు కనీసం రూ. 30,000 ఆదాయంగా నిర్ధారించాం” అని ధర్మాసనం పేర్కొంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ‘ప్రణయ్ సేథి’ తీర్పులో పేర్కొన్న నష్టపరిహార నిబంధనలకు అదనంగా, ఈ ‘గృహ సంరక్షణ నష్టం’ అనే అంశాన్ని కూడా చేర్చాలని జస్టిస్ కరోల్ స్పష్టం చేశారు.

గృహిణుల శ్రమను సమాజం తక్కువగా అంచనా వేయడంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. సంపాదించే కుటుంబ సభ్యులపై గృహిణులు ఆధారపడతారని అనడం నిజానికి ఒక విచిత్రమైన వాదన అని, వాస్తవానికి గృహిణిపైనే ఇల్లు గడుస్తుందని కోర్టు అభిప్రాయపడింది. “ఆర్థికంగా సంపాదించే వారే నిజానికి గృహిణిపై పూర్తిగా ఆధారపడతారు, కానీ దురదృష్టవశాత్తు ఈ వాస్తవానికి దక్కాల్సిన గుర్తింపు లభించడం లేదు. వివిధ రంగాల్లో ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ఇంకా ప్రయాణించాల్సిన దూరం ఎంతో ఉంది” అని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ఇకపై ‘హోమ్‌మేకర్’ అనే పదానికి ‘దేశ నిర్మాత’ అనే గుర్తింపు లభిస్తుందని తాము ఆశిస్తున్నట్లు జస్టిస్ కరోల్ వ్యాఖ్యానించారు.

ఏడాదిలోనే క్లెయిమ్‌లు తేల్చాలి

మోటారు ప్రమాదాల నష్టపరిహార కేసుల్లో జరుగుతున్న తీవ్ర ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రమాదాల బారిన పడిన కుటుంబాలకు సకాలంలో న్యాయం అందడం లేదని పేర్కొంది. ఇలాంటి సున్నితమైన కేసులను గరిష్టంగా ఏడాది (ఒక సంవత్సరం) లోపే పరిష్కరించాలని, బాధితులకు త్వరగా ఉపశమనం కలిగించాలని అధికారులను, న్యాయస్థానాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.