Mahaa Daily Exclusive

  ఆరో అంతస్తు నుంచి పసికందుతో దూకేసిన తల్లి….

Share

  • ఆరో అంతస్తు నుంచి పసికందుతో దూకేసిన తల్లి
  • ప్రాణాలతో బయటపడ్డ ఆరు నెలల పసిపాప
  • ప్రాణాలు కోల్పోయిన తల్లి

 

హైదరాబాద్, మహా : హైదరాబాద్‌లో ఘోరమైన ఘటన జరిగింది. ఐటీ రంగంలో స్థిరపడిన ఒక మహిళ తన పసిపాపతో భవనంపై నుంచి దూకేసింది ప్రాణాలు తీసుకుంది. మియాపూర్‌లోని మయూరినగర్‌లో గల లక్ష్మీప్రెస్టీజ్ అపార్ట్‌మెంట్‌ శనివారం ఉదయం ఈదుర్ఘటన జరిగింది. మృతురాలు 37 ఏళ్ల ఇషా సాహుగా గుర్తించారు. ఆమె వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లోని ఆరో అంతస్తు నుంచి ఇషా తన ఆరు నెలల పసికందును చేతుల్లో పట్టుకొని కిందకు దూకారు. అయితే కిందకపడుతున్న సమయంలో చిన్నారి ఆమె చేతుల్లోంచి జారి పక్కకు పడిపోయింది దీని వల్ల ఆ బిడ్డకు ప్రాణాపాయం తప్పింది. స్థానికులు వెంటనే స్పందించి చిన్నారిని కేబీహెచ్‌బీలోని లోటస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బిడ్డ ప్రాణాపాయం నుంచి బయటపడిందని వైద్యులు తెలిపారు.

 

నిద్రలేమి అసలు సమస్యా?

 

పోలీసులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, ఇషా సాహు గత కొంతకాలంగా తీవ్రమైన ఆరోగ్యం సమస్యలతో బాధపడుతోంది. ముఖ్యంగా నిద్రలేమి సమస్య ఆమెను గత కొన్ని నెలలుగా వేధిస్తున్నట్టు పోలీసు గుర్తించారు. సరైన నిద్ర లేకపోవడంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. నిద్రలేమి సమస్య మనిషి మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇది నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని దెబ్బ తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇషా సాహు ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు స్పష్టం చేశారు.

 

ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యుల నుంచి, పొరుగువారి నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. కేసు దర్యాప్తు పూర్తి కాక ముందే సోషల్ మీడియాలో ఎలాంటి పుకార్లు వ్యాప్తి చేయొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. కుటుంబ కలహాలు ఉన్నాయా లేదా వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా విచారణ సాగుతోంది.