Mahaa Daily Exclusive

  సీజేపీ నిరసనల్లో కుటుంబంతో కలిసి పాల్గొంటా. అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన

Share

 

న్యూఢిల్లీ, మహా.

దేశ రాజధానిలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన భారీ నిరసన కార్యక్రమంలో తాను, తన కుటుంబ సభ్యులంతా కలిసి ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నట్లు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ పోరాటం ఏ ఒక్క వ్యక్తికో లేదా రాజకీయ పార్టీకో పరిమితమైనది కాదని, దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశమని ఆయన స్పష్టం చేశారు.

దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న ఈ పోరులో ప్రజలందరూ పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై, ఎన్నికల సంఘంపై ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. బీజేపీకి అనుకూలంగా లేని వారి ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తూ, నకిలీ ఓట్లను జాబితాలో చేరుస్తున్నారని మండిపడ్డారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ హయాంలోనే ఇదంతా బహిరంగంగా జరుగుతోందని ఆరోపించిన ఆయన, ఈ అవకతవకలకు బాధ్యత వహిస్తూ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఉద్రిక్తతల నడుమ ముమ్మర ఏర్పాట్లు..

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలోని లోపాలు, ఓట్ల చోరీని నిరసిస్తూ సీజేపీ తలపెట్టిన ఈ ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన నిరసనలతో అట్టుడుకిన రాజధానిలో, తాజాగా కేజ్రీవాల్ కూడా ఈ ఆందోళనకు మద్దతు తెలపడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలతో పాటు నగరంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిరసనకారులను అడ్డుకునేందుకు అవసరమైన భద్రతా చర్యలను కఠినతరం చేశారు.