Mahaa Daily Exclusive

  అబద్ధపు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

Share

  •  మోదీ నాయకత్వంపై ప్రజలకు అచంచలమైన విశ్వాసం ఉందని స్పష్టీకరణ
  •   ఉప ఎన్నికల ఫలితాలతో ప్రతిపక్ష కూటమి ప్రజాదరణ కోల్పోయిందని వెల్లడి

న్యూఢిల్లీ, మహా.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరంతరం అబద్ధపు ప్రచారాలతో ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై దేశ ప్రజలకు అచంచలమైన విశ్వాసముందని, ఎన్ని వ్యతిరేక ప్రచారాలు ఎదురైనా బీజేపీ వరుస విజయాలతో దూసుకుపోతోందని ఆయన స్పష్టం చేశారు.

ఎన్నికల ఫలితాలే ప్రతిపక్షాల పతనానికి నిదర్శనం

పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఉప ఎన్నికల్లో ఎన్‌డీఏ ఘన విజయం సాధించడంతో పాటు, రాజస్థాన్ మరియు త్రిపురల్లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ సనుకూల ఫలితాలు వచ్చాయని అమిత్ షా గుర్తుచేశారు. ఈ తాజా ఎన్నికల ఫలితాలన్నీ దేశంలో ఇండియా కూటమి ప్రజాదరణ క్రమంగా కోల్పోతోందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయని ఆయన తేల్చిచెప్పారు.

సంస్థలను ప్రశ్నించడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారింది

ప్రజల మద్దతు పూర్తిగా కోల్పోతున్న ప్రతిపక్ష కూటమి పార్టీలు.. తాము ఎదుర్కొన్న ప్రతి ఓటమి తర్వాత ఎన్నికల వ్యవస్థలను, రాజ్యాంగ సంస్థలను అకారణంగా ప్రశ్నిస్తున్నాయని అమిత్ షా దుయ్యబట్టారు. ప్రతిపక్షాల ఈ ద్వంద్వ వైఖరిని, రాజకీయ కుట్రలను దేశ ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారని, అందుకే ప్రతీసారీ బీజేపీపై తమ అచంచల విశ్వాసాన్ని చాటుతూ స్పష్టమైన తీర్పునిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.