Mahaa Daily Exclusive

  ఆరు స్థానాల్లో ఉప ఎన్నికలు.. కాంగ్రెస్‌కు సున్నా సీట్లు!

Share

  •  రాహుల్ గాంధీ రాద్ధాంత రాజకీయాలను ప్రజలు మరోసారి తిరస్కరించారు.
  •   కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, మహా.

వివిధ రాష్ట్రాల్లోని 6 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి ఖాతా తెరవలేకపోవడంపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ-ఎన్డీయే కూటమి నాలుగు స్థానాల్లో ఘన విజయం సాధించిందని, రాహుల్ గాంధీ రాజకీయాలను భారత ప్రజలు పూర్తిగా తిరస్కరించారనడానికి ఇదే నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి ఆయన ఒక సూటి ప్రశ్న సంధిస్తూ.. “మీ రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని అంగీకరించడానికి ఇంకా ఎన్నిసార్లు ఓడిపోవాలనుకుంటున్నారు?” అని నిలదీశారు.

అస్సాంలోని నాగావ్‌ లోక్‌సభ స్థానాన్ని 2024లో గెలుచుకున్న కాంగ్రెస్, ప్రస్తుత ఉప ఎన్నికల్లో కనీసం రెండంకెళ్ల ఓట్ల శాతాన్ని కూడా సాధించలేకపోయిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. AIUDF కంటే వెనుకబడి మూడో స్థానానికి పడిపోయిందని, దేశాన్ని పాలించాలని కలలు కంటున్న ఆ పార్టీ తాను గెలిచిన స్థానంలోనే కేవలం రెండేళ్లలో డిపాజిట్ కోల్పోయిందని మండిపడ్డారు. ఇక పశ్చిమబెంగాల్‌లోని నందిగ్రామ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో తృణమూల్ కాంగ్రెస్ తన అభ్యర్థిని ఉపసంహరించుకుని మరీ కాంగ్రెస్‌కు మద్దతిచ్చినా, బీజేపీ 1.22 లక్షలకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించిందని గుర్తుచేశారు. మిత్రపక్షాల మద్దతును అరువు తెచ్చుకోవచ్చేమో కానీ, ప్రజల విశ్వాసాన్ని మాత్రం కాంగ్రెస్ కూడగట్టుకోలేకపోతోందని విమర్శించారు.

గత రెండు దశాబ్దాల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న వరుస ఓటములను కిషన్ రెడ్డి ఎత్తిచూపారు. ఢిల్లీలో వరుసగా మూడు ఎన్నికల్లో సున్నా సీట్లు రావడం, బిహార్‌లో యాత్రలు చేసినా నామమాత్రపు స్థానాలకే పరిమితం కావడం, ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం వంటి ఉదాహరణలను ప్రస్తావించారు. ఇప్పటివరకు 99 ఓటములు మూటగట్టుకున్న కాంగ్రెస్, త్వరలోనే ఓటముల సెంచరీ పూర్తి చేసుకోబోతోందని, ఈ సెంచరీ దాటడానికి ఎక్కువ రోజులు పట్టదని ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్‌లో 1989 నుంచి, బిహార్‌లో 1990 నుంచి, పశ్చిమ బెంగాల్‌లో 1977 నుంచి, గుజరాత్‌లో 1998 నుంచి, ఆంధ్రప్రదేశ్‌లో 2014 నుంచే ఆయా రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్‌ను పూర్తిగా తిరస్కరించారని గుర్తుచేశారు.

ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతీసారీ ఈవీఎంల మీద, ఎన్నికల సంఘం మీద, ప్రధాన ఎన్నికల కమిషనర్ మీద, ఓటర్ల జాబితాల మీద సాకులు వెతుక్కోవడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. భారత్‌లో ‘ఓట్ చోరీ’ అనేది లేనే లేదని, ఉన్నదల్లా ‘ఓట్ దూరీ’ మాత్రమేనని స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి ప్రతికూల రాజకీయాలు, విద్వేష రాజకీయాలు, డొల్ల హామీలు, అవినీతి, అహంకారం కారణంగానే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దూరం అయ్యారని తేల్చిచెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజలు అభివృద్ధి, సంక్షేమం, సమర్థ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, వికసిత్ భారత్ లక్ష్యానికి మద్దతుగా నిలుస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ ఇప్పటికైనా రాజ్యాంగ సంస్థలపై దాడులు చేయడం మానుకోవాలని హితవు పలికారు. విదేశాలకు వెళ్లి దేశ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడితే ప్రజలు ఆదరించరని, చేసిన తప్పులను సరిదిద్దుకుని ఓటరును గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు.