- తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి బీభత్సం.
- రేపు, ఎల్లుండి భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ.
హైదరాబాద్, మహా .
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు దక్షిణ తెలంగాణలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం నుంచే ఆకాశం మేఘావృతమై పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ముంచెత్తింది. శంషాబాద్ పరిధిలో కురిసిన కుండపోత వానకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శంషాబాద్ ఆర్టీసీ బస్టాండ్, రాళ్లగూడ రహదారులు చెరువులను తలపించాయి.
భారత వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం, రాగల రెండు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ అత్యంత ప్రమాదకరమైన ‘రెడ్ అలర్ట్’ ప్రకటించింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని, వర్షం పడే సమయంలో గంటకు 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు.
రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాలకు సైతం వాతావరణ శాఖ వేర్వేరు హెచ్చరికలు జారీ చేసింది. ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించగా.. సిద్దిపేట, జగిత్యాల, వరంగల్ రూరల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేశారు. తీవ్రమైన ఈదురుగాలులు, ఉరుములు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు.
అటు ఆంధ్రప్రదేశ్ పైనా నైరుతి రుతుపవనాల ప్రభావం తీవ్రంగా ఉంది. రేపు రాష్ట్రంలోని సుమారు 23 జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ విభాగం వెల్లడించింది. వర్షాలు, పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, భారీ హోర్డింగ్‌ల కింద ఆశ్రయం పొందవద్దని, విద్యుత్ స్తంభాలకు, తెగిపోయిన వైర్లకు దూరంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రెండు రాష్ట్రాల్లోనూ మున్సిపల్, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.








