- రూ.కోటి విలువైన గంజాయి పట్టివేత.
- ఐదుగురిని అరెస్ట్ చేసిన ‘ఈగిల్ ఫోర్స్.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న ‘ఈగిల్ ఫోర్స్’ అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. పకడ్బందీగా సాగుతున్న అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ నెట్‌వర్క్ గుట్టురట్టు చేసి, సుమారు కోటి రూపాయల విలువైన 200 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ స్మగ్లింగ్ దందాలో ప్రమేయం ఉన్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయగా, ముఠా ప్రధాన సూత్రధారులు పరారీలో ఉన్నారు.
ఈ ముఠాలో మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన అమోల్ నానోబా గోరే, లక్ష్మణ్ నాగ్ నాథ్ కారేలతో పాటు తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన వసంత జాదవ్, షేక్ అన్సార్, షేక్ రహమత్‌లను ఈగిల్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 104 ప్యాకెట్లలో ఉన్న 200 కిలోల గంజాయితో పాటు ఏడు మొబైల్ ఫోన్లు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఒడిశా నుంచి ఈ గంజాయిని సరఫరా చేస్తున్న దేవీ సింగ్, మహారాష్ట్రలోని ఉద్గీర్‌కు చెందిన రిసీవర్ కమ్ ఫైనాన్షియర్ ప్రభు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గంజాయి రవాణా కోసం నిందితులు ప్రత్యేకంగా అద్దెకు తీసుకున్న స్విఫ్ట్ డిజైర్, బొలెరో వాహనాలను సీజ్ చేశారు.
ఈ అంతర్రాష్ట్ర ముఠా కదలికలపై ఈగిల్ ఫోర్స్ గత 18 నెలలుగా పక్కా నిఘా ఉంచింది. ప్రధాన నిందితుడు అమోల్ నానోబా గోరే గతంలో నల్గొండ జిల్లా విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 336 కిలోల గంజాయి కేసులో అరెస్టయ్యాడు. అదే కేసులో తప్పించుకు తిరుగుతున్న వసంత జాదవ్‌ను గతేడాది జూలైలో అధికారులు అరెస్ట్ చేయగా, ఆమె బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ ఇదే దందాకు తెరతీసింది. మరోవైపు, నిజామాబాద్ యువతను మత్తుకు బానిసలుగా మారుస్తూ డ్రగ్స్ మాఫియాను నడుపుతున్న షేక్ అన్సార్‌పై ‘1908’ టోల్ ఫ్రీ నంబర్‌కు ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ సమాచారంతో అప్రమత్తమైన ఈగిల్ ఫోర్స్ అధికారులు.. ఈ నెల 7వ తేదీ నుంచి నిందితుల కదలికలను రహస్యంగా ట్రాక్ చేసి, గంజాయిని తరలిస్తున్న సమయంలో వలపన్ని అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.








