Mahaa Daily Exclusive

  భారీ వర్షాల హెచ్చరిక….

Share

  • భారీ వర్షాల హెచ్చరిక.
  • రంగంలోకి ‘క్యూర్‌’..
  • హై అలర్ట్‌ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.

 

హైదరాబాద్, మహా.

రాష్ట్రంలో, ముఖ్యంగా రాజధాని నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల ప్రకారం రాబోయే గంటల్లో మరిన్ని తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, అధికారులు అత్యంత అప్రమత్తంగా (హై అలర్ట్) ఉండాలని ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేసిన ‘హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్’ పరిధిలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే ముప్పు ఉన్నందున, క్షేత్రస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , డీజీపీ, ‘క్యూర్‌’ స్పెషల్ సీఎస్‌తో పాటు నగరంలోని అన్ని కీలక శాఖల ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీస్, లా అండ్ ఆర్డర్ పోలీస్, హైడ్రా ,విద్యుత్ శాఖ, జలమండలి (వాటర్ బోర్డ్) అధికారులు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుంటూ నియంత్రణ చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. వాతావరణ శాఖ అందించే రెయిన్ ఫోర్‌కాస్టింగ్ (వర్ష సూచన) వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నగరంలో రోడ్లపై నీరు నిలిచే సమస్యాత్మక ప్రాంతాలను (వాటర్ లాగింగ్ పాయింట్స్) ముందుగానే గుర్తించాలని స్పష్టం చేశారు.

వరద నీరు నిలిచే లోతట్టు ప్రాంతాలు, ఇరుకైన రహదారుల వద్ద విపత్తు నిర్వహణ బృందాలను ముందస్తుగా మోహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రధానంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలని, విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడితే తక్షణమే పునరుద్ధరించేలా సిబ్బంది అలర్ట్‌గా ఉండాలని చెప్పారు. నగరవాసులు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వర్షం పడే సమయంలో ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని సీఎం కోరారు. తాజా వాతావరణ పరిస్థితులపై సచివాలయం నుంచి సీనియర్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.