Mahaa Daily Exclusive

  నేనేమైనా సాధారణ కార్యకర్తనా..? 

Share

  • నేనేమైనా సాధారణ కార్యకర్తనా..?
  • సిరిసిల్ల ఎస్పీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం.

సిరిసిల్ల,మహా.

రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జిల్లా పోలీసు అధికారుల తీరుపై తీవ్ర అసహనానికి గురయ్యారు. అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను వస్తే జిల్లా ఎస్పీ ఎందుకు రాలేదంటూ అక్కడున్న పోలీసు అధికారుల ఎదుటే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తననేమైనా ఒక సాధారణ పార్టీ కార్యకర్తగా భావిస్తున్నారా అంటూ ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరిపై నిప్పులు చెరిగారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “మన బడి – మన బాధ్యత” కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కేంద్ర మంత్రి హోదాలో జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితర ఉన్నతాధికారులు విధిగా స్వాగతం పలకాల్సి ఉంటుంది. అయితే, బండి సంజయ్ హాజరైన ఈ కార్యక్రమానికి కిందిస్థాయి పోలీసు అధికారులు బందోబస్తు విధులు నిర్వహించారు మినహా, జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతె మాత్రం హాజరుకాలేదు.

తన పర్యటనకు జిల్లా ఎస్పీ గైర్హాజరు కావడంపై బండి సంజయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న కింది స్థాయి అధికారులను పిలిచి ఎస్పీ తీరును తీవ్రంగా ఎండగట్టారు. “కేంద్ర మంత్రిని అయిన నేను అధికారిక పర్యటనకు వస్తే ఎస్పీకి కనీస సమాచారం లేదా? ఒకవేళ ఉంటే ఎస్పీ ఎందుకు రాలేదు? నన్నేమైనా ఒక సాధారణ కార్యకర్త అనుకుంటున్నారా?” అంటూ తీవ్ర స్వరంతో అధికారులను నిలదీశారు. ప్రొటోకాల్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగానే తుంగలో తొక్కుతున్నారా అంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడంతో అక్కడ కొద్దిసేపు ఇబ్బందికర వాతావరణం నెలకొంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ప్రజాప్రతినిధి పట్ల జిల్లా పోలీసు బాస్ వ్యవహరించిన తీరు సరికాదని, అధికారుల ప్రవర్తన పట్ల బీజేపీ శ్రేణులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.