Mahaa Daily Exclusive

  మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్…

Share

  • మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్
  • మల్లారెడ్డి కాలేజీలో విద్యార్థికి ఫీజు వేధింపులు
  • రూ.1.10 లక్షలు ఫైన్ వేసిన వినియోగదారుల కమిషన్
  • ఒరిజినల్స్ ఇచ్చేసి కేసు విత్ డ్రా చేసుకోవాలని బాధితుడికి వేడుకోలు
  • అయినప్పటికీ పోరాడి గెలిచిన విద్యార్థి

హైదరాబాద్, మహా : మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీకి వినియోగదారుల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఓ విద్యార్థి విషయంలో మల్లారెడ్డి కాలేజీ అదనపు ఫీజు కోసం వేధింపులు చేస్తున్నట్లు ఆరోపణలు రాగా భారీగా జరిమానా పడింది. ఆ విద్యార్థికి రూ.1.10 లక్షలు చెల్లించాలని మల్లారెడ్డి కాలేజీని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. కోర్సు మధ్యలో ఆపేసిన విద్యార్థికి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా మల్లారెడ్డి కాలేజీ.. అదనపు ఫీజు డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించాడు.

హైదరాబాద్ నాంపల్లికి చెందిన రాకేష్ వర్మ అనే వ్యక్తి.. తన కుమారుడిని మైసమ్మగూడలో ఉన్న మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదివించేందుకు 2021 అక్టోబర్‌లో అడ్మిషన్ తీసుకున్నాడు. బీటెక్ ఏఐ, మెషీన్ లెర్నింగ్ కోర్సులో ఆ విద్యార్థి చేరాడు. అడ్మిషన్ సమయంలోనే బీటెక్ ఫస్టియర్ ట్యూషన్ ఫీజు కింద రూ.80 వేలు చెల్లించాడు. ఈ క్రమంలోనే తన టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్ ఒరిజినల్ సర్టిఫికెట్లను కూడా మల్లారెడ్డి కాలేజీ సిబ్బంది తీసుకున్నారు. ఈ క్రమంలోనే బీటెక్ జాయిన్ అయిన ఆ విద్యార్థి.. తొలి సెమిస్టర్ పూర్తి చేశాడు. ఆ తర్వాత అతడి కుటుంబానికి ఆర్థిక సమస్యలు వచ్చాయి. ఇక అతడి చదువుకు ఖర్చు చేసేందుకు ఆ కుటుంబం ఏమాత్రం డబ్బులు ఇవ్వలేకపోయింది. దీంతో తన చదువును మధ్యలోనే ఆపేయాలని ఆ విద్యార్థి నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే తన టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లను ఇవ్వాలంటూ బాధిత విద్యార్థి, అతడి తండ్రి కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించాడు. అందుకు కాలేజీ యాజమాన్యం ఒప్పుకోలేదు. ఫస్టియర్ ఫీజు కింద రూ.80 వేలు చెల్లించగా మరో రూ.80 వేలు చెల్లిస్తేనే ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీ యాజమాన్యం వేధింపులకు దిగింది.

ఈ క్రమంలోనే కాలేజీ తీరుపై విసుగు చెందిన రాకేష్ వర్మ, అతడి కుమారుడు.. గతేడాది సెప్టెంబరులో హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌-1ను ఆశ్రయించారు. దీంతో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీకి వినియోగదారుల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు రాగానే కాలేజీ యాజమాన్యం ఆ విద్యార్థిని పిలిచి ఒరిజినల్ సర్టిఫికెట్లను తిరిగి ఇచ్చేసింది. ఆ తర్వాత తమపై వేసిన కేసును కొట్టేయాలని విజ్ఞప్తి చేసింది. అయితే మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యం అతడికి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా 4 ఏళ్లుగా తీవ్ర మానసిక క్షోభకు గురి చేశారని పేర్కొన్న వినియోగదారుల కమిషన్ కాలేజీకి భారీ జరిమానా విధించింది. ఈ క్రమంలోనే బాధిత విద్యార్థికి రూ.లక్ష పరిహారంతోపాటు కోర్టు ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాలని వినియోగదారుల కమిషన్ మల్లారెడ్డి కాలేజీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం రూ.1.10 లక్షలను 45 రోజుల్లోగా చెల్లించాలని తేల్చి చెప్పింది. లేకపోతే ఆ మొత్తానికి 9 శాతం వడ్డీ కలిపి చెల్లించాల్సి ఉంటుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.