Mahaa Daily Exclusive

  భవానీపూర్ ఫలితంపై హైకోర్టుకెక్కిన దీదీ…

Share

భవానీపూర్ ఫలితంపై హైకోర్టుకెక్కిన దీదీ.
* సీఎం సువేందు అధికారి ఎన్నికను సవాల్ చేస్తూ మమతా బెనర్జీ పిటిషన్.
* కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపణ.
* 2021 నందిగ్రామ్ తరహాలోనే మళ్లీ న్యాయపోరాటం.
కోల్‌కతా,మహా.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన రాజకీయ ప్రత్యర్థిపై మరోసారి న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఇటీవల ముగిసిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గ ఫలితాన్ని సవాల్ చేస్తూ ఆమె మంగళవారం కలకత్తా హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ధృవీకరించేందుకు మమత స్వయంగా హైకోర్టు రిజిస్ట్రీ వద్దకు హాజరైనట్లు సమాచారం.
ఒకప్పుడు టీఎంసీకి కంచుకోటగా భావించే భవానీపూర్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ 15,015 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. తన సిట్టింగ్ స్థానంలో ఎదురైన ఈ ఓటమిని ఆమె తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ఈ ఫలితాలపై సమగ్ర న్యాయవిచారణ జరిపించాలని ఆమె తన పిటిషన్‌లో న్యాయస్థానాన్ని కోరారు. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు ఎన్నికలకు సంబంధించిన రికార్డులన్నింటినీ భద్రపరచాలని కూడా విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీ సాధించి, సువేందు అధికారి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, సువేందు అధికారి ఎన్నికను సవాల్ చేస్తూ మమతా బెనర్జీ కోర్టును ఆశ్రయించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గంలో సువేందు చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయిన సమయంలోనూ దీదీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఇప్పటికీ విచారణ దశలోనే (పెండింగ్) ఉంది. తాజా పిటిషన్‌తో రాష్ట్ర రాజకీయాల్లో మమత, సువేందుల మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరం మరోసారి తారాస్థాయికి చేరినట్లయింది. కాగా, మాజీ సీఎం దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై బీజేపీ నేతలు కానీ, సీఎం సువేందు అధికారి కానీ తక్షణమే స్పందించలేదు.