కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ.
* ఏపీలో నీటి కొరత తీర్చేందుకు ‘సూరత్ నమూనా’పై అధ్యయనం.
* గోదావరి పుష్కరాల వేళ నదీ జలాల స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి.
* నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలకు ఆదేశం.
ఢిల్లీ, మహా.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాగునీటి ఎద్దడి, కలుషితమవుతున్న నదుల పరిరక్షణ, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం ‘జల్ జీవన్ మిషన్’ అమలు వంటి పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా తాగునీటి కొరత పూర్తిగా తీరలేదనే విషయాన్ని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్ర ప్రజలకు నిరంతరాయంగా, స్థిరమైన తాగునీటి సరఫరాను అందించడానికి గుజరాత్‌లోని ప్రసిద్ధ ‘సూరత్ నమూనా’ను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు. సూరత్ నగరంలో పారిశ్రామిక వ్యర్థ జలాలను అత్యాధునిక సాంకేతికతతో శుద్ధి చేసి, వాటిని తిరిగి ఎలా విజయవంతంగా వినియోగిస్తున్నారో పరిశీలించాలని, అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేసేందుకు ఉన్న అవకాశాలపై నివేదిక సిద్ధం చేయాలన్నారు.
త్వరలోనే గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో నదీ జలాల స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక కాలుష్యం కారణంగా ఏపీలోని ప్రధాన నదులు, ఇతర జలవనరులు దారుణంగా దెబ్బతింటున్నాయని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ పరిశ్రమలు వదిలే రసాయన వ్యర్థాల వల్ల నదులు కలుషితం కాకుండా ఉండాలంటే ‘జీరో లిక్విడ్ డిశ్చార్జ్’ విధానాన్ని అత్యంత కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తూ నదులను కలుషితం చేసే వారిపై ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తేల్చి చెప్పారు.








