Mahaa Daily Exclusive

  తెలంగాణ అభివృద్ధి విషయంలో….

Share

  • తెలంగాణ అభివృద్ధి విషయంలో
  • నాకు రేవంత్ సర్టిఫికెట్ అవసరం లేదు
  • ప్రజల సర్టిఫికెట్ కావాలి
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • నిధులను అడ్డుకున్నట్లు ఆధారాలుంటే బహిర్గతం చేయాలి
  • తెలంగాణ అభివృద్ధి లో సీఎంతో కలిసి పని చేస్తా
  • కేంద్ర మంత్రులను కలిసేందుకు కూడా సీఎం తో వెళ్తా

న్యూఢిల్లీ, మహా : తెలంగాణ అభివృద్ధి విషయంలో తనకున్న చిత్తశుద్ధి ఏమిటన్నది తెలంగాణ ప్రజలకు తెలుసని, ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ తనకేమాత్రం అవసరం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మెట్రో అంశంలో తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై బురదజల్లుతున్నారంటూ మండిపడ్డారు. మంగళవారం న్యూఢిల్లీలో తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కిషన్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్‌-1కు కేంద్రం రూ.1250 కోట్లు ఇచ్చిందని గుర్తుచేశారు. దేశంలో మెట్రో రైలు ఫేజ్-2, 3లకు కేంద్రం ఎలా సహకరిస్తోందో హైదరాబాద్‌కూ అలాగే సహకారమందిస్తోందన్నారు.

మెట్రో రైలు ప్రాజెక్ట్ ను ఆపాలని తాను ప్రయత్నం చేస్తున్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘ రాష్ట్ర అభివృద్ధి మా బాధ్యత, నేను వద్దంటే ఎక్కడా ప్రాజెక్టులు ఆగవు. నేనెప్పుడూ తెలంగాణ ప్రయోజనాల కోసమే పని చేశాను. తెలంగాణలో కేంద్రం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. ఒక లక్షా 75 వేల కోట్ల రూపాయలతో రహదారులను అభివృద్ధి చేస్తున్నాం’ అని కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. తనపై సీఎం రేవంత్‌ చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ అనాలోచితంగా మాట్లాడుతున్నారన్న కిషన్ రెడ్డి తనకు రేవంత్‌రెడ్డి సర్టిఫికెట్‌ ఏమీ అవసరం లేదన్నారు. అభివృద్ధి అంశంలో తమకు పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేతలకు సూచించారు. తాను సీఎం రేవంత్‌కు కాదని.. ప్రజలకు జవాబుదారీని అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తాను పోరాటం చేశానని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఢిల్లీలో రెండుసార్లు ధర్నా చేశానన్నారు. బిల్లు ఆమోదం పొందాకే ఆమరణ దీక్షను విరమించానని వివరించారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం నాడు కేసీఆర్‌.. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖలు రాశానని తెలిపారు. రేవంత్‌ కోరితేనే తాను అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు.

మెట్రో విస్తరణ కోసం చురుగ్గా పనిచేయాలని.. గతంలోనే సీఎం రేవంత్‌కు లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి ప్రస్తావించారు. రేవంత్‌ అనుకుంటేనో.. తాను అడ్డుకుంటేనో ప్రాజెక్టులు ఆగవని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ అలా చేస్తుందేమో.. కానీ బీజేపీ అలా కాదని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. గత ఏడేళ్లుగా కేంద్ర సహాయమంత్రిగా, కేబినెట్ మంత్రిగా నేను తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేశానని, తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరగాలనే కోరుకున్నాను తప్ప ఏనాడూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు. మెట్రో ఫేజ్ 2 విషయంలో 50:50 నిష్పత్తిలో ముందుకెళ్లాలని సూత్రప్రాయంగా కేంద్రం అంగీకరించిందన్నారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నాతో, ముఖ్యమంత్రిగారు కలిసినప్పుడు కూడా ఈ విషయాన్ని తెలియజేశారన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, చర్లపల్లి విషయంలో.. అభివృద్ధి పనుల కోసం భూసేకరణ కావాలని అడిగినా.. నాడు కేసీఆర్, నేడు రేవంత్ రెడ్డి స్పందించలేదన్నారు. మెట్రో ఫేజ్ 2 కు నిధిలివ్వద్దంటూ కిషన్ రెడ్డి చెప్పారని సీం అన్నారు. ఆ ఆధారాలు ఇవ్వదలరా అని అడిగారు. ఆధారాల్లేని ఆరోపణలు చేయడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదని హితవు పలికారు. గతంలోనూ మెట్రో విషయంలో కేసీఆర్ అలైన్ మెంట్ మార్పుపేరుతో 3 ఏళ్లు కాలయాపనచేశారని, ఇవాళ రేవంత్ కూడా ఇదే తీరుతో వ్యవహరిస్తున్నారన్నారు. కేంద్ర మంత్రి కట్టర్ తో సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడొచ్చినా నేను కూడా వస్తాననని చెప్పారు.