గురుకులాల్లో రూ. 2000 కోట్ల భారీ కుంభకోణం.
* హామీలన్నీ ఎగ్గొట్టిన ముఖ్యమంత్రిని ‘ఎగవేతల రేవంత్ రెడ్డి’ అందాం.
* రూ. 19 వేల కోట్ల రైతుబంధు బకాయిలు తక్షణమే విడుదల చేయాలి.
* ఉచిత విద్యుత్‌కు ఉరితాడు బిగించేలా ‘రైతు డిస్కమ్’ కుట్ర.
* ఓట్ల గల్లంతు కాకుండా శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి: హరీశ్ రావు.
* మానకొండూరు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ప్రభుత్వ తీరుపై తీవ్ర ధ్వజం.
కరీంనగర్, మహా.
కాంగ్రెస్ ప్రభుత్వానిది స్కీముల పాలన కాదని, సివిల్ సప్లై, సింగరేణి, కరెంటు, భూములు, గురుకులాల్లో ఉప్పు, పప్పుల్లో సైతం జరిగే స్కాముల పాలన అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేవుని సాక్షిగా చెప్పిన రుణమాఫీ, పెన్షన్లు, మహిళా పథకాలన్నీ ఎగ్గొట్టిన ముఖ్యమంత్రిని ఇకపై ‘ఎగవేతల రేవంత్ రెడ్డి’ అని పిలుద్దామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం అల్గనూర్ గ్రామంలోని లక్ష్మీనరసింహ గార్డెన్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, స్థానిక మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులతో పాటు పెద్ద ఎత్తున స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని గురుకులాల్లో పిల్లలకు పెట్టే భోజనంలోనూ కాంగ్రెస్ నేతలు రూ. 2000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని హరీశ్ రావు ఆరోపించారు. బట్టలు, బూట్లకు రూ. 1200 కోట్లు, ఉప్పులు, పప్పులు, కోడిగుడ్లకు రూ. 800 కోట్లతో టెండర్లు పిలిచిన విషయమే ఆ శాఖల మంత్రులకు తెలియకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తానని చెప్పిన సీఎం.. కేవలం ఎనుముల వారి నలుగురు అన్నదమ్ములను మాత్రమే కోటీశ్వరులను చేశారని, వారే ఈ టెండర్లన్నీ మింగుతున్నారని ఎద్దేవా చేశారు. మూడు విడతల్లో రైతుబంధు ఎగ్గొట్టి అన్నదాతలకు బాకీ పడ్డ రూ. 19,000 కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాతకాలం నాటి పరిస్థితులు వచ్చాయని, ఎరువులకు యాప్ పెట్టి పోలీస్ స్టేషన్లలో లైన్లు కట్టే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. కళ్లాల్లో వడ్లు కొనక బస్తాలకు చెదలు పడుతున్నాయని, తరుగు పేరిట రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు డిస్కమ్ పేరుతో వ్యవసాయానికి ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌కు ఉరితాడు బిగించే కుట్ర జరుగుతోందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అమల్లోకి వస్తే ఎండ ఉన్నప్పుడు మాత్రమే 7 నుంచి 8 గంటలు పవర్ ఇస్తారని, కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే ఈఆర్సీ ముందు 3 గంటల కరెంట్ చాలని చెబుతున్నారని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఒక్క పైసా ఇవ్వకుండా 30 లక్షల మంది పేద విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపి వారి జీవితాలను ఆగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 19,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చామని, కానీ ఇప్పుడు కమిషన్లు రావనే ఉద్దేశ్యంతోనే కాంట్రాక్టర్లకు మాత్రం కోట్లు చెల్లిస్తూ విద్యార్థులను గాలికి వదిలేశారని విమర్శించారు. పేదలకు పైసలు లేవంటున్న సీఎం.. వందల కోట్లతో ఫ్యూచర్ సిటీ, ఎంసీహెచ్ఆర్డీలో క్యాంప్ ఆఫీసులు కట్టుకుంటూ ఫుట్బాల్ షోకులు, మూసీ సుందరీకరణ పేరిట విలాసాలకు పోతున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలని చెప్పి కేవలం 16 వేలే ఇచ్చారని, ఎగ్జామ్ అప్లికేషన్ ఫీజులు డబుల్ చేసి నిరుద్యోగుల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు. రిజిస్ట్రేషన్లు, బస్సు టికెట్లు, ఆర్టీఏ ఛార్జీలు ఇష్టారీతిన పెంచేసి ప్రజల రక్తం తాగుతున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై ఓటమి ఫ్రస్ట్రేషన్‌లో కాంగ్రెస్ నాయకులు అక్రమ కేసులు పెడుతున్నారని, వాటికి భయపడాల్సిన పనిలేదని హరీశ్ రావు భరోసా ఇచ్చారు. మానకొండూరు కార్యకర్తలు తెలంగాణ ఉద్యమంలో అద్భుతంగా పోరాడారని కొనియాడారు. ఇదే సమయంలో రాబోయే ఓటర్ల సవరణ ప్రక్రియ పై శ్రేణులను ఆయన అప్రమత్తం చేశారు. జూన్ 25 నుంచి జూలై 25 వరకు అధికారుల బృందం ఇంటింటికి వచ్చి సర్వే చేస్తుందని, గ్రామాల్లో అంగన్వాడీ టీచర్లు, పట్టణాల్లో ఆర్‌పీలు బూత్ లెవెల్ ఆఫీసర్లుగా వస్తారని వివరించారు. ఎక్కడా బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లు గల్లంతు కాకుండా బూత్ లెవెల్ ఏజెంట్లు వారివెంటే ఉండి ఫారాలు నింపడంలో ప్రజలకు సహకరించాలని దిశానిర్దేశం చేశారు. 2002 నాటి ఆధారాలు లేకున్నా, నిర్దేశించిన పది రకాల ధృవీకరణ పత్రాల్లో ఏది ఉన్నా ఓటు నమోదు చేసుకోవచ్చని, ఎవరైనా ఓటు కోల్పోతే న్యాయపోరాటం చేద్దామని పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపారు.








