Mahaa Daily Exclusive

  జులై మూడో వారంలో ‘తల్లికి వందనం’…

Share

జులై మూడో వారంలో ‘తల్లికి వందనం’.
* విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేశ్ సమీక్ష.
* ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపునకు కీలక ఆదేశాలు.
* సకాలంలో ప్రవేశ పరీక్షల నిర్వహణకు దిశానిర్దేశం.
అమరావతి, మహా.
రాష్ట్ర విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి విద్యార్థులకు నాణ్యమైన భవిష్యత్తును అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తల్లికి వందనం’ పథకాన్ని జులై మూడో వారంలో అమలు చేసేందుకు సన్నద్ధం కావాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల, ఉన్నత విద్యాశాఖల ఉన్నతాధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించే ఈ పథకానికి సంబంధించి తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని ఈ సందర్భంగా అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
**ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపుపై దృష్టి**
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను గణనీయంగా పెంచేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసేందుకు జూన్ 29వ తేదీన షైనింగ్ స్టార్స్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే, విద్యావ్యవస్థలో తల్లిదండ్రులను మరింతగా భాగస్వాములను చేసే ఉద్దేశంతో జులై మూడో వారంలో మెగా పీటీఎం’ (తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం) నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటితో పాటు మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని మంత్రి సూచించారు.
**సకాలంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు**
పాఠశాల విద్యతో పాటు ఉన్నత విద్యారంగంపై కూడా మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో నిర్వహించే ఎప్‌సెట్, పాలిసెట్, ఆర్‌సెట్ వంటి 12 రకాల ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్) నిర్వహణలో ఎలాంటి జాప్యం జరగకూడదని అధికారులను గట్టిగా ఆదేశించారు. జాతీయ స్థాయి పరీక్షలు, పొరుగు రాష్ట్రాల సెట్ల తేదీల వల్ల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తకుండా సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేసి.. నిర్ణీత గడువులోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 254 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 1.88 లక్షల ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఎప్‌సెట్ నోటిఫికేషన్ సిద్ధంగా ఉందని అధికారులు తెలుపగా, డిమాండ్ ఉన్న కోర్సులతో పాటు మెకానికల్, సివిల్ బ్రాంచ్ లలో ప్రభుత్వ పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల పెంపు అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
**అంతర్జాతీయ విద్యాసంస్థల రాకకు ఆహ్వానం**
రాష్ట్రానికి ప్రపంచస్థాయి విద్యాసంస్థలను తీసుకురావడం ద్వారా ఉన్నత విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు. థాపర్ ఇనిస్టిట్యూట్, జేమ్స్ కుక్ యూనివర్సిటీ, మెల్బోర్న్ యూనివర్సిటీ వంటి ప్రతిష్ఠాత్మక జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో తమ క్యాంపస్‌ల ఏర్పాటుకు చూపుతున్న ఆసక్తిపై ఈ సమావేశంలో సానుకూలంగా చర్చించారు. ముఖ్యంగా జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ వర్సిటీ ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఇదే సమయంలో రాష్ట్రంలో ఎన్‌సీసీ కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా ఎన్‌సీసీ స్టేట్ డైరెక్టరేట్’ ను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి లోకేశ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో ఏపీ యువతకు సైనిక శిక్షణలో మరింత మెరుగైన అవకాశాలు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఉన్నతస్థాయి సమీక్షలో విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి జె. శ్యామలరావు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా, ఉన్నతవిద్యా కమిషనర్ నారాయణ్ భరత్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.