Mahaa Daily Exclusive

  ఇకపై దగ్గు మందు కొనాలంటే డాక్టర్‌ చీటీ తప్పనిసరి!

Share

ఇకపై దగ్గు మందు కొనాలంటే డాక్టర్‌ చీటీ తప్పనిసరి!
* కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం.
* ‘షెడ్యూల్-కే’ నుంచి ‘సిరప్’ పదం తొలగింపు..
* కలుషిత మందులతో చిన్నారుల మరణాల నేపథ్యంలోనే కఠిన చర్యలు.
* అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ.
ఢిల్లీ, మహా.
దేశంలో ఇకపై జలుబు, దగ్గు సిరప్‌లను మెడికల్ షాపుల్లో నేరుగా కొనుగోలు చేసే వెసులుబాటు లేదు. రిజిస్టర్డ్ డాక్టర్ ఇచ్చిన చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ (చీటీ) ఉంటేనే ఫార్మసీ నిర్వాహకులు వీటిని విక్రయించాల్సి ఉంటుంది. ప్రజల ఆరోగ్యం, ఔషధాల భద్రత దృష్ట్యా కేంద్ర ఆరోగ్య శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నూతన నిబంధనలతో కూడిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను తాజాగా జారీ చేసింది.
‘డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్’ చట్టంలోని షెడ్యూల్-కే జాబితా నుంచి ‘సిరప్’ అనే పదాన్ని కేంద్రం పూర్తిగా తొలగించింది. దీంతో ఇప్పటివరకు ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా (ఓవర్ ది కౌంటర్) స్వేచ్ఛగా విక్రయించే దగ్గు సిరప్‌లు ఇకపై కేవలం వైద్యుల రాతపూర్వక సూచనతోనే లభించనున్నాయి. కాగా, ఈ నిబంధనల మార్పుపై ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌లోనే ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ ముసాయిదాపై ఎవరి నుంచీ ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతోనే ఇప్పుడు తుది నిర్ణయం తీసుకుని గెజిట్ విడుదల చేసినట్లు స్పష్టం చేసింది.
**చిన్నారుల మరణాల నేపథ్యంలోనే..**
ఇటీవల కాలంలో భారత్‌లో తయారైన కొన్ని రకాల దగ్గు సిరప్‌లు కలుషితమై చిన్నారుల ప్రాణాలు బలితీసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. గతేడాది రాజస్థాన్ రాష్ట్రంలో కలుషితమైన దగ్గు సిరప్ సేవించి ఏకంగా 22 మంది చిన్నారులు మృత్యువాతపడిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఆ చిన్నారుల మరణాల తర్వాత జరిపిన ప్రయోగశాల పరీక్షల్లో.. సదరు సిరప్‌లలో అత్యంత ప్రమాదకరమైన ‘డైఎథిలిన్ గ్లైకాల్’ రసాయనం పరిమితికి మించి అధిక మోతాదులో ఉన్నట్లు నిపుణులు తేల్చారు.
కేవలం దేశీయంగానే కాకుండా గాంబియా, ఉజ్బెకిస్థాన్, కామెరూన్ వంటి విదేశాల్లోనూ భారత్‌లో తయారైన దగ్గు సిరప్‌ల నాణ్యతపై పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తాయి. ఆయా దేశాల్లోనూ కలుషిత మందుల వల్ల పసిప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో మేల్కొన్న కేంద్ర ప్రభుత్వం.. ఔషధాల నాణ్యత, విక్రయ నియంత్రణ వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసే దిశగా ఈ కఠిన నిర్ణయానికి ఉపక్రమించింది.