ఎవరెస్ట్ ‘డెత్ జోన్’లో ఆపరేషన్ ‘గ్రీన్ బూట్స్’
* 30 ఏళ్లుగా మంచులో పడి ఉన్న మృతదేహం వెలికితీతకు ఐటీబీపీ భారీ మిషన్.
* జూన్-సెప్టెంబర్ మధ్య ఆపరేషన్.. వీడనున్న దశాబ్దాల మిస్టరీ!
ఢిల్లీ, మహా.
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఎవరెస్ట్ పర్వత ప్రాంతంలోని ‘డెత్ జోన్’లో ఏకంగా మూడు దశాబ్దాలుగా పడి ఉన్న ఓ భారతీయ పర్వతారోహకుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సన్నద్ధమైంది. దశాబ్దాలుగా ఎవరెస్ట్ పర్వతారోహకులకు ఓ విషాద గుర్తుగా మిగిలిపోయిన.. ప్రపంచవ్యాప్తంగా ‘గ్రీన్ బూట్స్’గా పిలిచే ఆ మృతదేహాన్ని వెనక్కి రప్పించేందుకు ఐటీబీపీ ఓ ప్రత్యేక మిషన్‌ను చేపట్టనుంది.
**జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య భారీ ఆపరేషన్**
ఈ అత్యంత ప్రమాదకరమైన, క్లిష్టమైన ఆపరేషన్ కోసం నిపుణులైన ‘హై ఆల్టిట్యూడ్ రికవరీ ఏజెన్సీ’ సేవలను ఐటీబీపీ వినియోగించుకోనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే టెండర్లు కూడా జారీ చేసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించే జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య ఈ భారీ మిషన్‌ను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 8,000 మీటర్లకు పైగా ఎత్తులో, రక్తం గడ్డకట్టే చలిలో ఉండే ‘డెత్ జోన్’లోకి ప్రవేశించి, ఆ మృతదేహాన్ని అత్యంత జాగ్రత్తగా కిందకు తీసుకురావడం ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యం. అనంతరం ఆ భౌతికకాయాన్ని నేపాల్ మార్గం గుండా భారత్‌కు తరలించనున్నారు.
**సవాళ్లతో కూడిన మిషన్**
ఈ ఆపరేషన్‌లో కనీసం ఆరుగురు అత్యంత అనుభవజ్ఞులైన షెర్పాలను రంగంలోకి దించనున్నారు. అయితే, ఇది కేవలం మృతదేహాన్ని కిందకు తీసుకురావడమే కాదు.. ఎన్నో దేశాల సరిహద్దులు, చట్టపరమైన అనుమతులతో ముడిపడి ఉన్న వ్యవహారం. టిబెట్‌లోని చైనా అధికారుల నుంచి అధికారిక అనుమతులు పొందడం, మృతదేహాన్ని సరిహద్దులు దాటించడం, లాంఛనాలు పూర్తి చేయడం వంటి ఎన్నో సవాళ్లు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ముప్పై ఏళ్లుగా మంచులో గడ్డకట్టి ఉన్న ఆ మృతదేహాన్ని ఎలాంటి నష్టం కలగకుండా ఎంతో గౌరవప్రదంగా భద్రపరచాల్సిన బాధ్యత కూడా రికవరీ బృందంపైనే ఉంటుంది.
**ఇంతకీ ఆ ‘గ్రీన్ బూట్స్’ ఎవరిది?**
‘గ్రీన్ బూట్స్’గా ప్రసిద్ధి చెందిన ఆ మృతదేహం అసలు ఎవరిదన్నది ఇప్పటికీ ఒక వీడని మిస్టరీగానే మిగిలిపోయింది. 1996లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన ఐటీబీపీ బృందంలోని లాన్స్ నాయక్ దోర్జే మోరుప్ లేదా హెడ్ కానిస్టేబుల్ త్సేవాంగ్ పాల్జోర్లది ఆ మృతదేహం అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆ ఏడాది ఎవరెస్ట్‌పై జరిగిన ఘోర విషాదంలో ముగ్గురు భారతీయ పర్వతారోహకులు అసువులు బాసారు. వారిలో ఆకుపచ్చని బూట్లు ధరించి ఉన్న ఒకరి మృతదేహమే కాలక్రమంలో పర్వతారోహకులకు ‘గ్రీన్ బూట్స్’గా గుర్తింపు పొందింది. ఈ ఆపరేషన్ విజయవంతమైతే భారతీయ వీరుడి పార్థివదేహం స్వదేశానికి చేరుకోవడమే కాకుండా, అది ఎవరిదన్న విషయంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.








