Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌లో ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’…

Share

హైదరాబాద్‌లో ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’.
* ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఓ రహదారికి అమెరికా అధ్యక్షుడి పేరు.
* జూన్ 23న అధికారికంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్, యూఎస్ రాయబారి.
* ఐటీ బంధాన్ని మరింత బలోపేతం చేసే వ్యూహం.
* నిర్ణయంపై భగ్గుమన్న బీజేపీ.
హైదరాబాద్, మహా.
భాగ్యనగరానికి విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ ఐకాన్‌గా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఒక ప్రముఖ రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేయాలని నిర్ణయించింది. నానక్‌రామ్‌గూడలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి ఆనుకుని ఉన్న ప్రస్తుత ‘యూఎస్ కాన్సులేట్ రోడ్డు’ను ఈ పేరుతో మార్చనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. జూన్ 23న ఈ రోడ్డును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
**వేడుకకు హాజరుకానున్న యూఎస్ రాయబారి**
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం (జులై 4)కి ముందే జరగనున్న ఈ ప్రారంభోత్సవ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్, పలువురు ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు, ఐటీ పరిశ్రమ ప్రముఖులు హాజరుకానున్నారు. తెలంగాణ ఐటీ రంగానికి, ఆర్థిక వృద్ధికి అమెరికా అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతగా, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో ట్రంప్ పేరును ప్రతిపాదిస్తూ గతంలో రేవంత్‌రెడ్డి చేసిన ఆలోచన ఇప్పుడు ఇలా కార్యరూపం దాల్చింది.
**గ్లోబల్ సిటీ బ్రాండింగ్‌లో భాగమే..**
హైదరాబాద్‌ను అంతర్జాతీయ ఆవిష్కరణల హబ్‌గా మార్చడంలో భాగంగా.. నగరంలోని కీలక రహదారులకు గ్లోబల్ బ్రాండ్లు, ప్రముఖుల పేర్లు పెట్టే బృహత్తర ప్రాజెక్టులో ఇది ఒక భాగమని ప్రభుత్వం చెబుతోంది. ఇటీవల రావిర్యాల ఇంటర్‌ఛేంజ్‌కు పారిశ్రామిక దిగ్గజం ‘రతన్ టాటా’ పేరు పెట్టిన ప్రభుత్వం, రాబోయే రోజుల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల పేర్లను కూడా కొన్ని జంక్షన్లకు పెట్టాలని యోచిస్తోంది. త్వరలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ కంటే ముందే అంతర్జాతీయ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యూహాన్ని అమలు చేస్తోంది.
**రాజకీయ రగడ.. బీజేపీ తీవ్ర అభ్యంతరం**
రోడ్లకు పేర్లు మార్చే నిర్ణయంపై రాష్ట్రంలో రాజకీయ రగడ మొదలైంది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఇలాంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని కమలనాథులు తప్పుబడుతున్నారు. అయినప్పటికీ, తాజా నిర్ణయం వల్ల అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ ప్రొఫైల్ మరింత మెరుగుపడుతుందని మద్దతుదారులు, ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఐటీ రంగంలోని లక్షలాది మంది యువ నిపుణులకు అమెరికా కంపెనీలతో భవిష్యత్తులో మరిన్ని కొత్త ఉపాధి అవకాశాలు దక్కుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.