Mahaa Daily Exclusive

  మద్యం ప్యాకింగ్‌లపై సుప్రీంకోర్టు సీరియస్!

Share

మద్యం ప్యాకింగ్‌లపై సుప్రీంకోర్టు సీరియస్!
* టెట్రా ప్యాక్‌ల నిషేధం కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ.
* కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు జారీ.
* జ్యూస్‌ ప్యాకెట్లను పోలి ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్.
ఢిల్లీ, మహా.
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్న ‘డ్రంకెన్ డ్రైవింగ్’ (తాగి వాహనాలు నడపడం) వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జేబుల్లో సులభంగా దాచుకోవడానికి వీలుగా ఉండే టెట్రా ప్యాక్‌లు, సాషేల రూపంలో విక్రయిస్తున్న మద్యం వల్ల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరుగుతున్నాయంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్)పై మంగళవారం కీలక విచారణ చేపట్టింది. ఈ తరహా ప్యాకింగ్‌లను పూర్తిగా నిషేధించాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతో పాటు 38 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎక్సైజ్ శాఖలకు నోటీసులు జారీ చేసింది.
**జ్యూస్ ప్యాకెట్ల తరహాలో మద్యం**
‘కమ్యూనిటీ అగైనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్’ సంస్థ ప్రతినిధి ప్రిన్స్ సింఘాల్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెట్రా ప్యాక్‌లలో విక్రయించే ‘గ్రీన్ ఆపిల్ వోడ్కా’ వంటి ఆల్కహాల్ ఉత్పత్తులు చూసేందుకు అచ్చం సాధారణ పండ్ల రసాల (జ్యూస్) ప్యాకెట్లలా ఉంటూ ప్రజలను, ట్రాఫిక్ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్యాకెట్లు చిన్నగా ఉండటం వల్ల కదులుతున్న వాహనాల్లో కూడా ఎవరికీ కంటపడకుండా, దొంగచాటుగా మద్యం సేవించడానికి వీలు కలుగుతోందని, తద్వారా ఘోర ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
**ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రాణాలపై లేదు..**
భారతదేశంలో ప్రతి సంవత్సరం 6 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా.. అందులో సుమారు 1.5 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోడ్డు ప్రమాదాల మృతుల్లో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న యువతే అత్యధికంగా ఉంటున్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఈ చిన్న టెట్రా ప్యాక్‌ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇవి మైనర్లకు సైతం అత్యంత సులభంగా దొరుకుతున్నాయని, మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న శ్రద్ధ.. ప్రజల ఆరోగ్యం, రోడ్డు భద్రతపై ఏమాత్రం ఉండటం లేదని పిటిషన్‌లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
**జాతీయ విధానం తీసుకురావాలి**
దేశంలో అతివేగం తర్వాత అత్యధిక మరణాలకు కారణం డ్రంకెన్ డ్రైవింగ్ మాత్రమేనని ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నకిలీ లేదా భ్రమ కలిగించే ప్యాకింగ్‌ల స్థానంలో కేవలం సులభంగా గుర్తించదగిన గాజు లేదా ప్లాస్టిక్ సీసాలను మాత్రమే వాడేలా జాతీయ స్థాయిలో ఒక కచ్చితమైన విధానాన్ని తీసుకురావాలని పిటిషనర్ కోరారు. అలాగే మద్యం ప్యాకింగ్‌లపై కూడా సిగరెట్ ప్యాకెట్ల తరహాలో పెద్ద అక్షరాలతో ఆరోగ్య హెచ్చరికలను ముద్రించడాన్ని తప్పనిసరి చేయాలని న్యాయస్థానాన్ని డిమాండ్ చేశారు.