ఆధార్ దుర్వినియోగంపై సుప్రీంకోర్టు సంచలన విచారణ!
* పౌరసత్వం, స్థానికత రుజువుగా వాడటంపై కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు.
* అక్రమ వలసదారులకు ఆధార్ వరంగా మారిందంటూ పిటిషన్.
* వెరిఫికేషన్ విధానంపై హై-పవర్ కమిటీ వేయాలని డిమాండ్.
ఢిల్లీ, మహా.
భారతీయ పౌరుల అత్యంత కీలకమైన గుర్తింపు పత్రం ‘ఆధార్’ దుర్వినియోగం అవుతోందన్న వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆధార్ కార్డులను చట్టవిరుద్ధంగా పౌరసత్వం, స్థానికత, నివాస చిరునామా రుజువులుగా ఉపయోగిస్తున్నారంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్)పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం కీలక విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల స్పందనను కోరుతూ నోటీసులు జారీ చేసింది.
**కేంద్రం, రాష్ట్రాలకు అత్యున్నత కోర్టు నోటీసులు**
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి. మోహన్లతో కూడిన సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి ధర్మాసనం ఈ విచారణ జరిపింది. ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ, అడ్వకేట్ అశ్వినీ దూబే ద్వారా దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు.. దీనిని ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఇలాంటి ఇతర సమాంతర కేసులతో జత చేయాలని ఆదేశించింది.
**ఆధార్ కేవలం గుర్తింపునకే పరిమితం కావాలి**
ఆధార్ కార్డును కేవలం ఒక వ్యక్తి గుర్తింపును నిరూపించే కార్డుగా మాత్రమే పరిమితం చేయాలని పిటిషనర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ న్యాయస్థానాన్ని గట్టిగా కోరారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ దేశ పౌరసత్వానికి, స్థానికతకు, నివాస చిరునామాకు లేదా పుట్టిన తేదీకి ప్రామాణిక రుజువుగా వాడకుండా నిలువరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) సైతం తగిన కఠిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా కొత్త ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకునే ఫారమ్-6లో పుట్టిన తేదీ, నివాస రుజువుగా ఆధార్‌ను అంగీకరించడాన్ని ఆయన కోర్టులో సవాల్ చేశారు. ఈ విధానం ఆధార్ చట్టం-2016లోని సెక్షన్ 9తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం (ఆర్పీఏ)-1950లోని సెక్షన్ 23(4)కు మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు పూర్తి విరుద్ధమని పిటిషనర్ ధర్మాసనానికి వివరించారు.
**అక్రమ చొరబాటుదారులకు వరంగా మారిన లూప్‌హోల్స్**
ఆధార్ చట్టం-2016లోని సెక్షన్ 9 ప్రకారం.. ఆధార్ అనేది పౌరసత్వానికి లేదా స్థానికతకు ఎలాంటి చట్టబద్ధమైన రుజువు కాదని చాలా స్పష్టంగా ఉందని పిటిషనర్ గుర్తుచేశారు. దీనికి తోడు 2023 ఆగస్టు 22న స్వయంగా యూఐడీఏఐ (UIDAI) జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్ సైతం.. ఆధార్ అనేది కేవలం గుర్తింపునకు మాత్రమే రుజువు అని, చిరునామాకు లేదా పుట్టిన తేదీకి కాదని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. అయినప్పటికీ దేశంలో విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఆస్తుల కొనుగోళ్లు, జనన ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సుల వంటి ప్రతి దానికి వయస్సు, పౌరసత్వ రుజువుగా ఆధార్‌ను వాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లూప్‌హోల్స్ (చట్టంలోని లొసుగులు) ఆధారంగా దేశంలోకి అక్రమంగా చొరబడిన వలసదారులు, చొరబాటుదారులు స్థానిక అధికారుల సిఫారసులు, అద్దె ఒప్పంద పత్రాలు చూపి సులభంగా ఆధార్ కార్డులు సంపాదిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత ఆ ఆధార్ కార్డు సాయంతో దేశ ఓటర్ల జాబితాలో చేరిపోతూ ఇతర అధికారిక పత్రాలను సైతం పొందుతున్నారని ధ్వజమెత్తారు.
**దేశ భద్రతకే ముప్పు.. హై-పవర్ కమిటీ వేయాలి**
ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియలో ఫారమ్-6 కింద జరుగుతున్న ఓటర్ల వెరిఫికేషన్ విధానం తీవ్ర లోపభూయిష్టంగా ఉందని, సరైన చట్టబద్ధమైన పత్రాలు లేని విదేశీయులు కూడా దీనివల్ల భారత ఓటర్ల డేటాబేస్‌లోకి చొరబడుతున్నారని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక విదేశీయుడైనా సరే ఏడాదిలో 182 రోజులు భారతదేశంలో నివసిస్తే ఇక్కడి నిబంధనల ప్రకారం ఆధార్ పొందే వీలుండటమే దీనికి ప్రధాన కారణమన్నారు. ఇలా చొరబాటుదారులు ఓటు హక్కు సాధించడం వల్ల దేశంలో జనాభా సమతుల్యత (డెమోగ్రాఫిక్ ఛేంజ్) మారిపోతోందని, ఇది అంతిమంగా దేశ భద్రతకే తీవ్ర విఘాతం కలిగిస్తుందని హెచ్చరించారు. ఈ ప్రమాదకర పరిస్థితిని నివారించేందుకు దేశ ఎన్నికల వెరిఫికేషన్ విధానాన్ని సమూలంగా పునర్వ్యవస్థీకరించాలని కోరారు. ఈ మొత్తం సంస్కరణలను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అధ్యక్షతన సైబర్ సెక్యూరిటీ, ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన ఒక హై-పవర్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని పిటిషనర్ అభ్యర్థించారు.








