రాహుల్ గాంధీ ఒక పెద్ద జోక్.
* కాంగ్రెస్‌పై డీఎంకే ఘాటు వ్యాఖ్యలు!
* కూటమి వీడి విజయ్ వైపు వెళ్ళిన హస్తం పార్టీపై ‘మురసోలి’ పత్రికలో నిప్పులు.
* విపక్షాల ఐక్యతను దెబ్బతీస్తోంది రాహులేనని ఆరోపణ.
* తమిళనాడు రాజకీయాల్లో భగ్గుమన్న విభేదాలు.
చెన్నై,మహా.
దశాబ్దాల మిత్రపక్షాలైన డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ బంధం పూర్తిగా తెగిపోయింది. లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి డీఎంకే తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీని ఒక ‘పెద్ద జోక్’ అంటూ ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియా వేదికగా డీఎంకే ఐటీ విభాగం సంచలన పోస్ట్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ దేశంలో రాజకీయ మనుగడ కోసం తీవ్రంగా పోరాడుతున్న క్లిష్ట సమయంలో తాము ఆ పార్టీని భుజాలపై మోశామని డీఎంకే గుర్తుచేసింది. కానీ, ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో తెరపైకి వచ్చిన ఒక కొత్త మెరిసే బొమ్మను (నటుడు, రాజకీయ నేత విజయ్ను ఉద్దేశించి) చూడగానే.. కాంగ్రెస్ తమ పాత పడవ నుంచి ఒక్కసారిగా దూకేసిందంటూ మండిపడింది.
**విపక్షాల చీలికకు రాహుల్ గాంధీనే కారణం!**
జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత గురించి గొప్పగా మాట్లాడే రాహుల్ గాంధీయే.. స్వయంగా ఆ ఐక్యతను తీవ్రంగా బలహీనపరుస్తున్నారని డీఎంకే అధికారిక పత్రిక ‘మురసోలి’ ధ్వజమెత్తింది. ఇటీవల జరిగిన ఇండియా బ్లాక్ సమావేశం అనంతరం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ సోమవారం ప్రచురించిన సంపాదకీయంలో డీఎంకే హస్తం పార్టీపై నిప్పులు చెరిగింది. దేశంలోని వివిధ ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రమైన చీలికలు రావడానికి కాంగ్రెస్ అగ్రనేత రాజకీయ వైఖరే ప్రధాన కారణమని ఆరోపించింది. రాహుల్ ఒకవైపు విపక్షాల ఐక్యత గురించి అందరికీ ఉపన్యాసాలు ఇస్తూనే.. మరోవైపు వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని మండిపడింది. ఇండియా కూటమిలోని ఇతర మిత్రపక్షాలు లేవనెత్తిన అంశాలకు మాత్రం తాము ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూనే ఉంటామని డీఎంకే ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
**మిత్రపక్షాలనే లక్ష్యంగా చేసుకుంటున్న కాంగ్రెస్**
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అయితే, ఆ తర్వాత డీఎంకే కూటమికి కటీఫ్ చెప్పి, విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రభుత్వంలో సంకీర్ణ భాగస్వామిగా చేరడంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇటీవలే జరిగిన ఇండియా కూటమి సమావేశానికి కూడా డీఎంకే హాజరుకాకుండా దూరంగా ఉంది.
వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును మురసోలి పత్రిక ఈ సందర్భంగా ఎండగట్టింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో అప్పటి సీఎం పినరయి విజయన్‌కు, బీజేపీకి మధ్య రహస్య అవగాహన ఉందంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ప్రస్తావించింది. అప్పట్లో వామపక్ష (కమ్యూనిస్టు) నాయకులు ఈ విమర్శలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని గుర్తుచేసింది. దేశంలో ప్రధాన శత్రువైన బీజేపీని ఎదుర్కోవడం కంటే, కాంగ్రెస్ తన సొంత మిత్రపక్షాలను లక్ష్యంగా చేసుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపుతోందా? అని వామపక్ష నేతలు ప్రశ్నించేలా రాహుల్ వ్యవహరించారని ఆరోపించింది.
**సొంత కూటమిలోనే ఒంటరైన హస్తం పార్టీ!**
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని సమర్థంగా సవాలు చేసేందుకు ఇండియా బ్లాక్‌లోని ప్రాంతీయ పార్టీలన్నీ క్షేత్రస్థాయిలో మెరుగైన స్థితిలో ఉన్నాయని డీఎంకే అభిప్రాయపడింది. కానీ, ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పదేపదే పనిచేశాయని మురసోలి సంపాదకీయం ఘాటుగా విమర్శించింది. ప్రాంతీయంగా తమ ప్రభుత్వాలు ఏర్పడే అవకాశాలను కాంగ్రెస్ పార్టీనే స్వయంగా దెబ్బతీస్తోందని కూటమి భాగస్వాములే బహిరంగంగా ఆరోపిస్తున్నప్పుడు.. ఇప్పుడు కాంగ్రెస్ ఏ ముఖం పెట్టుకుని విపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతుందని ప్రశ్నించింది. ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలోనూ వామపక్షాలు, సమాజ్‌వాదీ పార్టీ సహా పలు ఇండియా బ్లాక్ భాగస్వామ్య పార్టీలు కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలను తీవ్రంగా విమర్శించాయని, రాహుల్ గాంధీ అపరిపక్వ రాజకీయ వైఖరి ప్రతిపక్ష కూటమిలో పదేపదే ఘర్షణలకు దారితీస్తోందని డీఎంకే తేల్చిచెప్పింది.








