Mahaa Daily Exclusive

  ఏసీబీ రికార్డు రైడ్….

Share

ఏసీబీ రికార్డు రైడ్.
* బెడ్‌ కింద కోటిన్నర నోట్ల కట్టలు, కిలో బంగారం!
* ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి నివాసమే లక్ష్యంగా విరుచుకుపడ్డ అవినీతి నిరోధక శాఖ.
* ఏకకాలంలో 11 ప్రాంతాల్లో సోదాలు.
* మార్కెట్ విలువ రూ. 200 కోట్లకు పైనే ఉంటుందని అంచనా.
* అవినీతి తిమింగలం అరెస్ట్.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి తిమింగలాల గుండెల్లో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు మరోసారి ఫ్యూజులు ఎగరగొట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో ల్యాండ్స్ అండ్ సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు మంగళవారం మున్నెన్నడూ లేని విధంగా అత్యంత భారీ సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నరహరి బెడ్ కింద, ఇల్లాంతటా దాచి ఉంచిన నోట్ల కట్టలను చూసి అధికారులే విస్తుపోయారు. ఏకంగా రూ. 1.54 కోట్ల భారీ నగదు, కిలో బంగారం, గుట్టల కొద్దీ బినామీ ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో ఏసీబీ దాడులలో ఒక ప్రభుత్వ అధికారి ఇంట్లో ఇంత భారీ స్థాయిలో నగదు దొరకడం ఇదే అత్యధికం కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
**ఆరుగురు డీఎస్పీలు.. 11 చోట్ల ఏకకాలంలో దాడులు**
నరహరి అక్రమ సామ్రాజ్యంపై ఏసీబీ అధికారులు అత్యంత పకడ్బందీగా వ్యూహం రచించారు. ఆరుగురు డీఎస్పీలు, 20 మంది ఇన్‌స్పెక్టర్లతో కూడిన ప్రత్యేక బృందాలు ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 11 కీలక ప్రాంతాలలో సోదాలు చేపట్టాయి. అత్తాపూర్, మియాపూర్, గచ్చిబౌలి వంటి హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతాలలో బినామీ పేర్లతో కొనుగోలు చేసిన ఓపెన్ ప్లాట్లు, లగ్జరీ విల్లాల పత్రాలతో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎకరాల కొద్దీ విస్తరించి ఉన్న భారీ వ్యవసాయ భూముల డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, భూముల పత్రాల ప్రభుత్వ విలువ సుమారు రూ. 5 కోట్లుగా తేల్చగా.. బహిరంగ మార్కెట్ (ఓపెన్ మార్కెట్)లో వీటి అసలు విలువ దాదాపు రూ. 200 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
**ఏసీబీ చరిత్రలోనే రికార్డు స్థాయి నగదు**
ఈ సోదాలకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ మీడియాకు అధికారికంగా వెల్లడించారు. నరహరి ఇంట్లోనే రూ. 1.40 కోట్లకు పైగా నగదు లభ్యమైందని, మిగిలిన చోట్ల దొరికిన దాంతో కలిపి మొత్తం రూ. 1.54 కోట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గతంలో జలమండలి జనరల్ మేనేజర్ ఇంట్లో కోటీ పది లక్షల రూపాయలు, ఆర్‌ అండ్ బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో రూ. 65 లక్షల నగదుతో పాటు బంగారు బిస్కెట్లు దొరకడమే ఇప్పటివరకు పెద్ద కేసులని.. కానీ వాటన్నింటి రికార్డులను తిరగరాస్తూ నరహరి ఇంట్లో ఏకంగా కోటిన్నరకు పైగా నగదు పట్టుబడటం ఏసీబీ చరిత్రలోనే ఒక సంచలనమని ఆయన పేర్కొన్నారు. నరహరికి సంబంధించిన మరికొన్ని బ్యాంకు లాకర్లను తెరిచేందుకు ఇప్పటికే బ్యాంకు అధికారులకు అధికారికంగా లేఖలు రాశామని వెల్లడించారు.
**అవినీతి తిమింగలం నరహరి అరెస్ట్**
సుంకరి నరహరి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనకు వచ్చిన చట్టబద్ధమైన జీతం, ఇతర ఆదాయాల వివరాలపై ఏసీబీ ఆర్థిక నిపుణులు పక్కాగా లెక్కలు గడుతున్నారు. ల్యాండ్ అండ్ సర్వే విభాగంలో కీలకమైన పదవిలో ఉంటూ భూముల సర్వేలు, వివాదాల పరిష్కారం పేరిట ఆయన పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. మంగళవారం రోజంతా సాగిన సుదీర్ఘ సోదాల అనంతరం నిందితుడు నరహరిని ఏసీబీ అధికారులు సాయంత్రం అధికారికంగా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతుండటంతో ఈ అవినీతి తిమింగలానికి సంబంధించిన మరిన్ని అక్రమాస్తుల చిట్టా, బినామీల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని, పూర్తి స్థాయి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ స్పష్టం చేశారు.