Mahaa Daily Exclusive

  తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోలేదు..

Share

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోలేదు.
* సీఎం రేవంత్‌రెడ్డివి దిగజారుడు రాజకీయాలు.
* కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.
* మెట్రో ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేంద్రమంత్రి.
* ప్రాజెక్టులు ఆపే సంస్కృతి బీజేపీకి లేదు.
* సీఎం ఎప్పుడంటే అప్పుడు కేంద్రమంత్రితో చర్చలకు నేనూ వస్తా.
* కాంగ్రెస్‌ సర్టిఫికెట్లు మాకు అవసరం లేదని స్పష్టీకరణ.
ఢిల్లీ, మహా.
హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టు విషయంలో తనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత కొన్నిరోజులుగా చేస్తున్న తప్పుడు ఆరోపణలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఖండించారు. మంగళవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలు సాఫీగా జరగాలనే తాను ఎల్లప్పుడూ కోరుకున్నానని, గత ఏడేళ్లుగా కేంద్ర సహాయమంత్రిగా, కేబినెట్ మంత్రిగా రాష్ట్రాభివృద్ధి కోసమే శ్రమించానని స్పష్టం చేశారు. తానేనాడూ రాష్ట్ర ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదని, ప్రాజెక్టులను ఆపే సంస్కృతి అసలు బీజేపీలోనే లేదని తేల్చిచెప్పారు.
**మెట్రో ఫేజ్-2కు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం**
మెట్రో ఫేజ్-1, ఫేజ్-2 ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆధారరహితమని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో సంయుక్తంగా చేపట్టేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారని వెల్లడించారు. కేంద్ర మంత్రి గారు తమతో పాటు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారన్నారు. గతంలో మెట్రో ఫేజ్-1 ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ. 1,250 కోట్లు అందించిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయంగా దాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. దేశంలోని ఇతర నగరాల తరహాలోనే హైదరాబాద్ విషయంలోనూ సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలను (టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ) చర్చించి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ‘కిషన్‌రెడ్డి ఆపమంటే కేంద్రం పనులు ఆపదు.. తెలంగాణ అభివృద్ధి పట్ల మాకున్న చిత్తుశుద్ధికి ఎవరి సర్టిఫికెట్లు అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు.
**కేసీఆర్ లాగే రేవంత్‌రెడ్డి కూడా కాలయాపన**
గతంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మెట్రో అలైన్‌మెంట్ మార్పుల పేరుతో మూడేళ్ల పాటు కాలయాపన చేశారని, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి కూడా అదే తీరుతో వ్యవహరిస్తూ తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. సికింద్రాబాద్, నాంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులకు భూసేకరణ చేయాలని అడిగితే నాడు కేసీఆర్, నేడు రేవంత్‌రెడ్డి స్పందించలేదని ఆరోపించారు. అయినప్పటికీ, నాడు కేసీఆర్ సహకరించకపోయినా ఎంఎంటీఎస్ (MMTS) ఫేజ్-2ను కేంద్ర నిధులతోనే నిర్మించామని గుర్తుచేశారు. గడిచిన కాలంలో తెలంగాణలో రూ. 1.75 లక్షల కోట్లతో జాతీయ రహదారుల ప్రాజెక్టులు నిర్మించామని, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, 42 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు చేపట్టామని వివరించారు. ఈ ఏడాది కేవలం ధాన్యం కొనుగోళ్ల కోసమే కేంద్రం రూ. 34,000 కోట్లు అందించిందని, మూసీ పునరుజ్జీవనం కోసం ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) నుంచి రూ. 4,100 కోట్ల రుణం ఇప్పించామని తెలిపారు.
**రుణాల చెల్లింపు నిబంధనలపై కేంద్రం సూచనలు**
రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC) నుంచి పొందగోరుతున్న రూ. 13,500 కోట్ల రుణాల ఒప్పందంపై ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలను కిషన్‌రెడ్డి కొట్టిపారేశారు. ఈ విషయమై తాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో మాట్లాడానని చెప్పారు. మెట్రో ద్వారా వచ్చే ఆదాయం నుంచి ఆపరేషన్స్, మెయింటెనెన్స్ (నిర్వహణ ఖర్చులు) చూడకుండా.. ముందుగా ఐఆర్‌ఎఫ్‌సీ రుణాలను చెల్లించేందుకు సీఎం ఒప్పందం కుదుర్చుకున్నారని, దీనిపైనే కేంద్రం కొన్ని సాంకేతిక మార్పులను సూచించిందని కిషన్‌రెడ్డి వివరించారు. దేశవ్యాప్తంగా ఏ మెట్రో సంస్థ కూడా అప్పులను ముందే చెల్లించదని, ముందుగా ఆపరేషన్, మెయింటెనెన్స్ చూస్తేనే మెట్రో మనుగడ సాధ్యమవుతుందని.. కానీ దీనికి ముఖ్యమంత్రి అంగీకరించడం లేదని కేంద్ర మంత్రి చెప్పినట్లు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. “ఫైనాన్స్ ఇవ్వొద్దని నేను ఏ కేంద్ర మంత్రితో చెప్పానో రేవంత్‌రెడ్డి నిరూపించగలరా? ఊరికే ఆధారాల్లేని ఆరోపణలు చేయడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదు” అని హితవు పలికారు.
**చర్చలకు నేను సిద్ధం.. గ్యారెంటీలపై ఎందుకు మాట్లాడరు?**
మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలను విమర్శల ద్వారా కాకుండా దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కిషన్‌రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ గారితో సమావేశానికి ఎప్పుడు ఢిల్లీ వచ్చినా, తాను కూడా ఆ సమావేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, తనకు ఎలాంటి భేషజాలు లేవని స్పష్టం చేశారు. తెలంగాణకు రూపాయి నిధులు వచ్చినా సంతోషపడే మొదటి వ్యక్తిని తానేనని, ఇందుకోసం ఒక స్పెషల్ సెల్ పెట్టుకుని మరీ పనిచేస్తున్నామని వివరించారు. తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అసలు ప పాలనే లేనట్లు, రేవంత్‌రెడ్డి వచ్చాకే ప్రజాస్వామ్యం వచ్చినట్లు సీఎం వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీల అమలు ఏమైందో సమాధానం చెప్పాలని, వాటి గురించి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదని కిషన్‌రెడ్డి నిలదీశారు.