కార్పొరేట్ విద్యాసంస్థలకే వణుకు పుట్టిస్తున్న ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’.
* ప్రభుత్వ బడులకే ‘నో అడ్మిషన్’ బోర్డులు.
* రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో సరికొత్త విద్యా విప్లవం.
* అత్యాధునిక వసతులు, ఉచిత బస్సు, అల్పాహారంతో ఆరుట్లలో టీపీఎస్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.
* రాష్ట్రవ్యాప్తంగా వంద పాఠశాలలే లక్ష్యం.
ఆరుట్ల (రంగారెడ్డి జిల్లా)మహా.
రాష్ట్ర విద్యా రంగంలో ప్రజా ప్రభుత్వం సరికొత్త చరిత్ర లిఖించబోతోంది. దశాబ్దాలుగా నలిగిపోతున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ, లక్షలాది రూపాయలు దండుకునే కార్పొరేట్ విద్యాసంస్థలకే వణుకు పుట్టించేలా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన డ్రీమ్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను ఉచితంగా అందించడమే లక్ష్యంగా రూపుదిద్దుకున్న ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ వ్యవస్థ బుధవారం నుంచి లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్లలో సర్వాంగ సుందరంగా, కార్పొరేట్ స్థాయిని తలదన్నేలా నిర్మించిన తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను బుధవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.
**ఉదయం 9:30 గంటలకు పండుగలా ప్రారంభోత్సవం**
బుధవారం ఉదయం 9:30 గంటలకు ఆరుట్లకు చేరుకోనున్న ముఖ్యమంత్రి.. ముందుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాన్‌ను అత్యంత ఘనంగా ఆవిష్కరిస్తారు. అనంతరం ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దిన డిజిటల్ క్లాస్‌రూమ్స్, సువిశాలమైన లైబ్రరీ, అత్యాధునిక సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, జిమ్ వంటి సౌకర్యాలను స్వయంగా పరిశీలిస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా ముఖాముఖి సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. విద్యార్థులతో పాటే కూర్చుని అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) చేసిన అనంతరం, అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
**సర్కారీ బడికి ‘నో అడ్మిషన్’ బోర్డు.. తల్లిదండ్రుల క్యూ!**
ప్రభుత్వ పాఠశాల అంటే కనీస వసతులు ఉండవనే అపోహను ఆరుట్ల టీపీఎస్ పటాపంచలు చేసింది. ఆరుట్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను సురక్షితంగా బడికి తీసుకురావడానికి ప్రభుత్వం ఏకంగా ఐదు ప్రత్యేక స్కూల్ బస్సులను ఏర్పాటు చేసింది. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు పూర్తి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరగనుంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అన్నీ ఉచితంగానే అందిస్తారు. దీనికి తోడు క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి క్రీడలకు ప్రత్యేక మైదానాలు, నిష్ణాతులైన కోచ్‌లను సైతం అందుబాటులో ఉంచారు. ఈ రేంజ్ వసతులు చూసి మురిసిపోతున్న తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్ల నుంచి మాన్పించి మరీ ఇక్కడ చేర్పించేందుకు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఈ స్కూల్లో ప్రీ-ప్రైమరీలో 150, ప్రైమరీలో 600, హైస్కూల్ విభాగంలో 800, ఇంటర్ మొదటి సంవత్సరంలో 160, రెండో సంవత్సరంలో 104 మంది.. ఇలా ఏకంగా 1,814 మంది విద్యార్థులు నమోదయ్యారు. డిమాండ్ ఊహించని స్థాయికి చేరడంతో ఏకంగా బడి గేటుకు ‘నో అడ్మిషన్’ బోర్డు తగిలించాల్సిన పరిస్థితి నెలకొందంటే.. ఈ స్కూల్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
**విద్యా కమిషన్ పర్యవేక్షణలో అద్భుత సృష్టి**
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యను నిలబెట్టాలన్న సంకల్పంతో రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రత్యేక ‘విద్యా కమిషన్’ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఆకునూరి మురళి, సభ్యులు పీఎల్ విశ్వేశ్వర్ రావు, డాక్టర్ చారకొండ వెంకటేష్, జోష్నా శివారెడ్డిల అహర్నిశల ప్రత్యేక పర్యవేక్షణలోనే ఈ ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇంత అద్భుతంగా రూపుదిద్దుకుంది. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసానికి (ఓవరాల్ డెవలప్మెంట్) సమాన ప్రాధాన్యతనిస్తూ నూతన బోధనా పద్ధతులను ఇక్కడ అమలు చేయనున్నారు.
**దశలవారీగా వంద స్కూళ్లు.. పైలట్‌గా నాలుగు!**
తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రజా ప్రభుత్వం పక్కా కార్యాచరణను సిద్ధం చేసింది. ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద నాలుగు పాఠశాలలను ఎంపిక చేసి అభివృద్ధి చేశారు. మొదటి విడతలో రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలలతో పాటు.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలను టీపీఎస్‌లుగా తీర్చిదిద్దారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేసి, పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను ఉచితంగా అందించాలని రేవంత్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. రేపు ఆరుట్లలో లాంఛనంగా ప్రారంభం కానున్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్.. తెలంగాణ రాష్ట్ర విద్యా చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాల మైలురాయిగా నిలిచిపోనుందని విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు.








