లష్కర్ బోనాలకు ముహూర్తం ఖరారు.
* ఆగస్టు 2న ఉజ్జయిని మహంకాళి బోనాలు.
హైదరాబాద్, మహా.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ప్రసిద్ధ హైదరాబాద్ బోనాల జాతరలు మరో నెలరోజుల్లో నగరంలో అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఆషాఢ మాసంలో జరిగే ఈ పండుగలో వందల ఏళ్లుగా వస్తున్న ఆచారం ప్రకారం మొదటి బోనాన్ని గోల్కొండ కోటలోని జగదాంబికా అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఆషాఢ మాసంలో వచ్చే తొలి గురువారం లేదా ఆదివారం నాడు గోల్కొండ కోటలో ఉన్న శ్రీ జగదాంబిక అమ్మవారికి తొలి పూజ చేసి, కుమ్మరి సంఘానికి చెందిన మహిళలు మొట్టమొదటి బోనాన్ని భక్తిశ్రద్ధలతో సమర్పిస్తారు.
ఈ క్రమంలోనే సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢమాస లష్కర్ బోనాల ఉత్సవాలకు అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. జులై 19న ఘటాల ఊరేగింపుతో ఈ ఉత్సవాలకు అంగరంగ వైభవంగా శ్రీకారం చుట్టనున్నారు. ప్రధాన ఘట్టమైన అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమాన్ని ఆగస్టు 2వ తేదీన నిర్వహించనుండగా, భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భవిష్యవాణి (రంగం) కార్యక్రమాన్ని మరుసటి రోజు అనగా ఆగస్టు 3న నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులకు అందజేశారు.








