Mahaa Daily Exclusive

  వర్షాభావ పరిస్థితులపై కేంద్రం అప్రమత్తం…

Share

వర్షాభావ పరిస్థితులపై కేంద్రం అప్రమత్తం.
* ప్రత్యామ్నాయ ప్రణాళికలకు మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశం.
ఢిల్లీ, మహా.
దేశంలో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతుందనే అంచనాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రానున్న రోజుల్లో దాదాపు పది రాష్ట్రాలపై ఈ వర్షాభావ ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని భావిస్తున్న తరుణంలో, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వర్షపాతం తక్కువగా ఉండే జిల్లాలను ముందుగానే గుర్తించి, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సహాయ సహకారాలు అందించి, వారికి అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో ఉన్న స్థానిక వాతావరణం, నేల స్వభావానికి అనుగుణంగా ప్రత్యేక పంటల ప్రణాళికను రూపొందించడంపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు, అంతర పంటల సాగు, భూమిలో తేమ నిర్వహణ, నీటి సంరక్షణ తదితర అంశాలపై రైతులకు ముందస్తుగా విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. రైతులను భయాందోళనలకు గురిచేసే సమాచారానికి బదులుగా, శాస్త్రీయ విశ్లేషణలతో కూడిన కచ్చితమైన పరిష్కార మార్గాలను మాత్రమే వారికి చేరవేయడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఈ క్రమంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోబోయే ఆంధ్రప్రదేశ్ (ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం), తెలంగాణ, మహారాష్ట్ర (విదర్భ, మరాఠ్వాడా), కర్ణాటక, గుజరాత్ (సౌరాష్ట్ర, కచ్), రాజస్థాన్ పశ్చిమ ప్రాంతం, మధ్యప్రదేశ్ పశ్చిమ జిల్లాలు, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా మరియు బీహార్ రాష్ట్రాలకు కేంద్రం హైఅలర్ట్ ప్రకటించి, ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది.
మరోవైపు దేశీయంగా పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచి, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్రం ప్రత్యేక మిషన్‌ను వేగవంతం చేస్తోంది. పంటల మార్పిడి విధానంలో భాగంగా కందులు, మినుములు, పెసల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు రైతులకు సాంకేతిక సాయంతో పాటు నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తేవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. పత్తి రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ఆధునిక శాస్త్రీయ పద్ధతులు, మల్చింగ్ మరియు అంతర పంటల విధానాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. దేశవ్యాప్తంగా ఎరువుల నిల్వలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, రుతుపవనాల పురోగతికి అనుగుణంగా ఏ జిల్లాలోనూ మైక్రో-లెవెల్ కొరత రాకుండా ముందస్తుగా ఎరువుల సరఫరాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు , ఐకార్ సంస్థలు పరస్పర సమన్వయంతో క్షేత్రస్థాయికి వెళ్లి, తమ ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానాన్ని సకాలంలో రైతుల పొలాల్లోకి చేర్చినప్పుడే ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఖరీఫ్ పంటలను సురక్షితంగా కాపాడుకోగలమని శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు.