తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతంపై మీనాక్షి నటరాజన్ దృష్టి.
* ఈనెల 21 నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు.
హైదరాబాద్, మహా.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలో విస్తృత పర్యటనలకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ అంశం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో, పార్టీ సంస్థాగత వ్యవహారాలను చక్కదిద్దడం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా అట్టడుగు స్థాయి నుంచి ఎన్నికల యంత్రాంగాన్ని పటిష్టం చేసే దిశగా కార్యచరణను రూపొందించారు.
ఈ నెల 21వ తేదీ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి మీనాక్షి నటరాజన్ పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. పార్టీ కార్యక్రమాల పురోగతి, ఎన్నికల సన్నద్ధత, క్షేత్రస్థాయి కార్యకలాపాలపై స్థానిక నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమీక్షలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాల్లో భాగంగా, బూత్ స్థాయి ఏజెంట్లకు (బీఎల్‌ఏలు) నిర్వహించే ప్రత్యేక శిక్షణా శిబిరాల్లో ఆమె స్వయంగా పాల్గొంటారు. ఓటరు జాబితాల పరిశీలన, ఎన్నికల నిర్వహణలో బీఎల్‌ఏల కీలక పాత్ర, బూత్ స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు ఆమె దిశానిర్దేశం చేయనున్నారు.
పర్యటనల షెడ్యూల్ ప్రకారం జూన్ 21న మక్తల్ నియోజకవర్గంలో, జూన్ 23న ఆందోల్ నియోజకవర్గంలో ప్రత్యేక సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో టీపీసీసీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు కూడా పాల్గొని కార్యకర్తలకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. సంస్థాగత నిర్మాణం ప్రధాన లక్ష్యంగా సాగుతున్న ఈ పర్యటనలు, కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా, మీనాక్షి నటరాజన్‌పై హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో దాఖలైన ఓ పిటిషన్‌ను న్యాయస్థానం ఇటీవల తిరస్కరించిన విషయం తెలిసిందే. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులను విచారించే ప్రత్యేక పరిధి తమకు లేదని స్పష్టం చేస్తూ, సదరు పిటిషన్‌ను కోర్టు పిటిషనర్‌కే వాపస్ చేయడం ప్రస్తుతం న్యాయ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామాల నడుమ జరుగుతున్న ఆమె పర్యటనలు పార్టీ వర్గాల్లో మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.








