అమరజ్యోతి కేంద్రంగా ఉద్యమకారుల గుర్తింపు.
* 23 నుంచి విస్తృత సంప్రదింపులు.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారులను అధికారికంగా గుర్తించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 23వ తేదీ నుంచి సచివాలయం ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారకం ‘అమరజ్యోతి’ కేంద్రంగా వివిధ వర్గాలతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరపాలని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. 2001 నుంచి 2014 వరకు స్వరాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వారిని గుర్తించి, వారికి తగిన గౌరవం దక్కేలా రాజకీయాలకు అతీతంగా ఈ ప్రక్రియను చేపట్టనున్నారు.
ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించే క్రమంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు మంగళవారం అమరజ్యోతి ప్రాంగణాన్ని ప్రత్యేకంగా సందర్శించారు. స్మారక ప్రాంగణంలో నిర్మించిన వివిధ గదులతో పాటు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆడియో-విజువల్ రూమ్‌ను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం కమిటీ చైర్మన్ కే. కేశవరావు నేతృత్వంలో అమరజ్యోతి కేంద్రంగానే కమిటీ సభ్యులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ప్రతిష్ఠాత్మక సమావేశంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ , మోతె శోభన్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
నిజమైన ఉద్యమకారులను గుర్తించేందుకు కమిటీ పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. దశలవారీగా విద్యార్థి జేఏసీ ప్రతినిధులు, కళాకారులు, రచయితలు, ప్రజా సంఘాల నాయకులు, న్యాయవాదులు, వైద్యులు తదితర వర్గాలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి వారి నుంచి అమూల్యమైన సూచనలు, సలహాలను స్వీకరించనున్నారు. అలాగే, ఉద్యమకారుల సంక్షేమ కమిటీలతోనూ విస్తృత స్థాయిలో చర్చలు జరిపి ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని కమిటీ తీర్మానించింది.
ఈ గుర్తింపు ప్రక్రియలో ఎలాంటి లోపాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా చేపట్టేందుకు కమిటీ ప్రత్యేక విధానాన్ని ప్రకటించింది. సమాచార సేకరణ కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తులు, సూచనలు స్వీకరించనున్నారు. ఆన్‌లైన్ విధానంలో వివరాల నమోదుకు వీలుగా ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే ఆఫ్‌లైన్ విధానంలో ఉద్యమకారులు నేరుగా తమ ప్రతినిధ్యాలు సమర్పించేందుకు వీలుగా ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. అందిన ప్రతి వినతిని, వివరాలను ఎప్పటికప్పుడు పక్కాగా రికార్డుల్లో నమోదు చేసేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.








